WPL: అమ్మాయిల ఆఖరి సమరానికి అంతా సిద్ధం.. టికెట్లు మొత్తం అమ్మకం..
WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ లో ఇంకా మిగిలున్నవి రెండు మ్యాచ్ లు మాత్రమే.

సుమారు మూడు వారాలుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తుది అంకానికి చేరుకున్నది. ఈ లీగ్ లో మిగిలున్నవి రెండు మ్యాచ్ లే. రేపు (శుక్రవారం) ముంబై ఇండియన్స్ - యూపీ వారియర్స్ నడుమ ఎలిమినేటర్ జరుగనుండగా ఆదివారం (మార్చి 26న) ఫైనల్ జరుగుతుంది. అయితే బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరుగబోయే ఫైనల్ కు టికెట్లు మొత్తం అమ్ముడయ్యాయని సమాచారం.
ఈ లీగ్ లో ఇదివరకే ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఎలమినేటర్ మ్యాచ్ లో గెలిచిన విజేతతో తుది సమరంలో తలపడనున్నది. కాగా ఈ మ్యాచ్ కోసం మార్చి 22న ఆన్లైన్ లో టికెట్లు అమ్మకానికి పెట్టగా అన్నీ అమ్ముడుపోయినట్టు తెలుస్తున్నది.
వాళ్లకు ఫ్రీ లేదు..
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో తొలిసీజన్ కు గాను టికెట్ రేట్లను బీసీసీఐ నామమాత్రపు రుసుమునే నిర్ణయించింది. టికెట్ రేట్లు రూ. 100, 200, 250 గానే ఉంచింది. బాలికలు, అమ్మాయిలు, మహిళలకు అయితే డబ్ల్యూపీఎల్ ను ఉచితంగానే చూడనిచ్చారు. లీగ్ ను ప్రోత్సహించేందుకు గాను బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఫైనల్ కు మాత్రం ఈ నిబంధనను మార్చారు. బ్రబోర్న్ స్టేడియంలో ఈనెల 26న జరుగబోయే ఫైనల్ మ్యాచ్ కు మహిళలకు ఉచిత ప్రవేశం లేదు. స్టేడియంలోకి వచ్చే ప్రేక్షకులంతా టికెట్ల (రూ. 250) ను కొనుగోలు చేయాల్సిందే. మహిళలకు, బాలికలకు ఉచిత ఎంట్రీ తీసేసినా.. టికెట్లన్నీ అమ్ముడుపోవడం గమనార్హం. టికెట్ కొన్నవాళ్లంతా మ్యాచ్ చూడటానికి వస్తే 20 వేల మంది సామర్థ్యంలో ఫైనల్ జరుగనుంది.
ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఇది..
ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్ - యూపీ వారియర్స్ నడుమ జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ గెలవడంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా నేరుగా ఫైనల్ కు అర్హత సాధించింది.
- మార్చి 24 : ముంబై ఇండియన్స్ వర్సెస్ యూపీ వారియర్స్ (ఎలిమినేటర్)
- మార్చి 26 : ఎలిమినేటర్ విజేత వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్