క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కవర్‌ డ్రైవ్‌లను చూసేందుకు రెండు కళ్లు సరిపోవు.  పేస్‌, స్పిన్‌, స్వింగ్‌ అనే తేడా లేకుండా సచిన్‌ టెండూల్కర్‌ డ్రైవ్‌లతో బౌండరీలు బాదటంలో దిట్ట. వాటిలోనూ సచిన్‌ టెండూల్కర్‌ బ్యాక్‌ ఫుట్‌ డ్రైవ్‌లు మరింత ప్రత్యేకం. 

ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్‌ అంత సులువుగా బ్యాక్‌ ఫుట్‌ టెక్నిక్‌తో డ్రైవ్‌లు చేయటం అంత సులువు కాదు. దానికి ఎంతో నాణ్యమైన సాధన అవసరం. అప్పుడు గానీ మైదానంలో తడబాటు లేకుండా బ్యాక్‌ఫుట్‌ షాట్లు ఆడేందుకు అవకాశం చిక్కుతుంది. లేదంటే, బ్యాక్‌ఫుట్‌ షాట్లకు వెళ్లి, బౌలర్‌కు వికెట్‌ సమర్పించుకోవటం పరిపాటే.  

రెండు దశాబ్దాల క్రికెట్‌ కెరీర్‌లో బ్యాక్‌ఫుట్‌ షాట్లతో ప్రపంచ క్రికెట్‌ అభిమానులను అలరించిన సచిన్‌ టెండూల్కర్‌.. తన బ్యాక్‌ఫుట్‌ షాట్ల వెనుక ఉన్న రహస్యాన్ని తాజాగా పంచుకున్నాడు.

సచిన్‌ చిన్నతనంలో బంధువుల ఇంట్లో ఉండేవాడు. అక్కడ ఓ చిన్న గదిలో సచిన్‌ టెండూల్కర్‌ షాక్స్‌కు బంతికి కట్టి ప్రాక్టీస్‌ చేసేవాడు. అదే గదిలో సచిన్‌ టెండూల్కర్‌ పాపులర్‌ బ్యాక్‌ఫుట్‌ షాట్‌ను నేర్చుకున్నాడు. సచిన్ టెండూల్కర్‌ ఆంటీ మంగళ టెండూల్కర్ గోల్ఫ్‌ బాల్‌తో సచిన్‌ టెండూల్కర్‌కు బ్యాక్‌ఫుట్‌ షాట్లు ఆడేందుకు బంతులు విసిరేది. అలా ఆంటీ విసిరిన గోల్ఫ్‌ బంతులతోనే సచిన్‌ టెండూల్కర్‌ బ్యాక్‌ఫుట్‌ షాట్‌పై ఓ పట్టు సాధించాడు.

 సచిన్ తన ప్రాక్టీస్ కి ఇబ్బంది కలగకూడదని తన ఇంట్లో కాకుండా ఆంటీ మంగళ టెండూల్కర్ ఇంట్లో ఉండేవాడు. శివాజీ పార్కు సమీపంలోని వీరి ఇంట్లో టెండూల్కర్ నాలుగు సంవత్సరాలపాటు గడిపాడు. రమాకాంత్ ఆచ్రేకర్ వద్ద శిక్షణ పొందే సమయంలో ఇక్కడే ఉండేవాడు టెండూల్కర్. 

ఈ విషయాన్ని సచిన్‌ టెండూల్కర్‌ తాజాగా వెల్లడించాడు. ఆమె పుట్టినరోజుకు మళ్లీ ఆ ఇంటికి వెళ్లిన సచిన్ టెండూల్కర్‌ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. అదే గదిలో సచిన్‌ ఆంటీ పుట్టినరోజు కేక్‌ను కట్‌ చేశారు. 80 ఏండ్ల వయసులోనూ మా ఆంటీ నాకు బ్యాక్‌ఫుట్‌ షాట్‌ కోసం గోల్ఫ్‌ బంతులు విసిరేందుకు సిద్ధంగా ఉందని సచిన్‌ టెండూల్కర్‌ పేర్కొన్నాడు. 

ఈ మేరకు సచిన్‌ టెండూల్కర్‌ తన ఆంటీ పుట్టినరోజు కేక్‌ కటింగ్‌ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశాడు. ఆ వీడియోలో సచిన్‌ టెండూల్కర్‌ ఈ విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.