Virat Kohli: జట్టులో చోటు కష్టమనుకుంటున్నప్పుడు నన్ను ఆదుకున్నది అతడే.. కోహ్లీ షాకింగ్ కామెంట్స్
Virat Kohli: భారత క్రికెట్ జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచకప్ లో వరుస హాఫ్ సెంచరీలతో దుమ్మురేపుతున్నాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు టాప్ స్కోరర్ గా ఉన్న కోహ్లీ.. తాజాగా తాను ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నప్పుడు జరిగిన విషయాలను గుర్తు చేసుకున్నాడు.
టీ20 ప్రపంచకప్ లో మెరుగైన ప్రదర్శనలతో అదరగొడుతున్న విరాట్ కోహ్లీ ఆటతీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పుడంటే కోహ్లీని అందరూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు గానీ నాలుగైదు నెలల క్రితం మాత్రం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. మూడేండ్లుగా అంతర్జాతీయ క్రికెట్ లో సెంచరీ చేయడం లేదనే కోహ్లీపై క్రికెట్ పండితులు కత్తులు నూరారు. వారి విమర్శలకు తగ్గట్టుగానే కోహ్లీ ఆటతీరు కూడా నానాటికీ తీసికట్టుగా మారింది. సెంచరీలు, హఫ్ సెంచరీల సంగతి పక్కనబెడితే కనీసం క్రీజులో నిలబడితే చాలు అనే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా అందరూ కోహ్లీపై విమర్శల వర్షం కురిపించారు.
ఈ ఏడాదిలో కోహ్లీపై విమర్శల పర్వం ఇంకా ఎక్కువైంది. దక్షిణాఫ్రికా సిరీస్ లో వైఫల్యాలు, తర్వాత స్వదేశంలో వెస్టిండీస్, శ్రీలంక మీద కూడా రాణించక.. ఐపీఎల్ లో విఫలమై.. ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలో అట్టర్ ఫ్లాఫ్ అయిన కోహ్లీని ఇక జట్టు నుంచి తీసేయడమే మంచిదన్న కామెంట్లు వినిపించాయి. ఆ సమయంలో కోహ్లీ కాస్త డిప్రెషన్ కు కూడా గురయ్యాడు.
కోహ్లీ ఈ దశను ఆసియా కప్ కు ముందు దాటాడు. అయితే తాను ఫామ్ లేమితో తంటాలు పడుతున్నప్పుడు ఆదుకున్నవారు ఎవరూ లేరని.. ఒక్క ధోని మాత్రం తనకు ధైర్యం చెప్పాడని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ లో కోహ్లీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తాజాగా విడుదల చేసిన పోడ్‌కాస్ట్ లో కోహ్లీ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
కోహ్లీ మాట్లాడుతూ.. ‘అప్పుడు నాకు నిజంగా మద్దతునిచ్చింది ఎంఎస్ ధోని. ధోనితో నాకు స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ ఉంది. అది ఫ్రెండ్‌షిప్ కంటే ఎక్కువగా పరస్పర గౌరవం అని నేను చెప్పగలను. నేను ఫామ్ లేమితో తంటాలు పడుతున్నప్పుడు ధోని నాకు ఒక మెసేజ్ చేశాడు.
ఆ మెసేజ్ లో ధోని.. ‘నువ్వు ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉండాలని అనుకుంటున్నావో.. అంతే బలంగా కనిపించాలి. ప్రజలు నువ్వు ఎలా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారని అడగడం మరిచిపోతారు’ అని నాకు చెప్పాడు. అది నాకు చాలా బలంగా తాకింది. నాకు కావాల్సిన ప్రోత్సాహం కూడా ఇదే కదా అనిపించింది..’ అని అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.