Asianet News TeluguAsianet News Telugu

Virat Kohli: అజ్ఞాతవాసం ముగిసింది.. అసలు కథ ముందుంది.. ది కింగ్ ఈజ్ బ్యాక్

Asia Cup 2022: గడిచిన ఏడాదికాలంగా భారత క్రికెట్ లో మాజీ సారథి  విరాట్ కోహ్లీ ఫామ్ గురించి జరిగినంత చర్చ మరే అంశం మీద జరగలేదంటే అతిశయోక్తి కాదు.  కానీ అనుమానాలను పటాపంచలు చేస్తూ.. 

The King Is Back to Rule World Again: Twitter Reacts After Virat Kohli Show in Asia Cup
Author
First Published Sep 5, 2022, 10:17 AM IST

ఒకప్పుడు షర్ట్ బటన్ వేసుకున్నంత ఈజీగా సెంచరీలు బాదిన ఆ ఆటగాడు గడిచిన రెండు మూడేండ్లుగా క్రీజులో నిలబడటానికే ఇబ్బందులు పడుతుంటే అతడి ఆటను చూస్తున్నవారికి  అసహనం కలిగింది. మరీ ముఖ్యంగా  గడిచిన ఆరేడునెలలుగా ఆ దిగ్గజం ఆటను చూస్తే అసహనం కాస్త అసహ్యంగా మారింది. ఒకప్పుడు అతడికి వీరాభిమానులుగా ఉన్నవారే..  ‘ఇతడేంటి ఇంత దరిద్రంగా ఆడుతున్నాడు. ఇక ఆడడా..?’  అనుకున్నారు.  సిరీస్ లు ముగుస్తున్నాయి.  రోజులు గడుస్తున్నాయి. పరుగులు లేవు. ఒకప్పుడు అవలీలగా చేసిన సెంచరీల జాడ లేదు.  సెంచరీ సంగతి దేవుడెరుగు, కనీసం క్రీజులో కుదురుకుంటే చాలు అనుకున్నారు. అదీ జరగలేదు. ఇంటా బయటా విమర్శలు. ‘ఇక ఆడడు.. రిటైరైతే బెటర్..’ అన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఎక్కడ చూసినా నైరాశ్యం. కానీ అన్నీ రోజులు ఒకలా ఉండవు కదా. సాయంత్రం అస్తమించిన సూర్యుడు ఉదయాన్నే రాకపోతాడా..? 

వచ్చాడు.. విరాట్ కోహ్లీ కూడా అలాగే వచ్చాడు. గోడకు కొట్టిన బంతి కంటే వేగంగా  వచ్చాడు.  కోహ్లీ వైఫల్యాలను చూసినవారు ‘కాస్త విరామం తీసుకుంటే  బాగుండు..’ అన్న మాటలు విన్న  ‘కింగ్’ వారి దయను మన్నించి ఇంగ్లాండ్ పర్యటన తర్వాత   ఓ నెలరోజులు క్రికెట్ ముఖం చూడలేదు.  క్రికెట్ ఆడటం  మొదలుపెట్టాక నెల రోజుల దాకా బ్యాట్ ముట్టలేదు.  కానీ విరామం తర్వాత  మునపటి కోహ్లీని చూస్తున్నాం. 

ది కింగ్ ఈజ్ బ్యాక్.. 

ఆసియా కప్ లో  కోహ్లీ ఆట మునపటి విరాట్ ను గుర్తుకు చేస్తుందనడంలో సందేహమే లేదు. గణాంకాల సంగతి పక్కనబెడితే  క్రీజులోకి వచ్చాక కోహ్లీ ఆత్మ విశ్వాసంతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఐపీఎల్ లో  కోహ్లీ ముఖంలో ఇది కనిపించలేదు. ఐపీఎల్ ఆడేప్పుడు కోహ్లీ ముఖంలో ఏదో తెలియని నిరాశ కనిపించేది.  ఇంగ్లాండ్ పర్యటనలోనూ అదే ప్రస్పుటించింది.  కానీ ఆసియా కప్  లో పాకిస్తాన్ తో ఆడిన తొలి మ్యాచ్ తో పాటు  హాంకాంగ్ తోనూ కోహ్లీ సానుకూల దృక్పథంతో బ్యాటింగ్ చేశాడు. ఇన్నాళ్లు తనను వేధించిన ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్ ఆవలగా వెళ్తున్న బంతులను టచ్ చేయడం లేదు. అనవసర షాట్లకు పోకుండా పరిస్థితులకు తగ్గట్టుగా ఆడుతున్నాడు. తొలి రెండు ఇన్నింగ్స్ లలో అతడు కాస్త నెమ్మదిగా ఆడినా సూపర్-4లో మాత్రం రెచ్చిపోయాడు. అప్పటికే  దూకుడుగా ఆడి నిష్క్రమించిన రోహిత్, రాహుల్ ల వలే  రెచ్చిపోయాడు.   

 

వేట మొదలైంది.. 

మూడేండ్లుగా ఫామ్ లేమితో బ్యాటింగ్ లో వెనుకబడ్డ  కోహ్లీ మళ్లీ  పరుగుల వేట మొదలుపెట్టాడు. ఈ టోర్నీలో ఇప్పటికి మూడు మ్యాచులు ఆడిన కోహ్లీ.. పరుగుల పరంగా  (3 మ్యాచులు 154 రన్స్) రిజ్వాన్ (3 మ్యాచులు, 192 రన్స్) తర్వాత ఉన్నాడు.  టీమిండియా వరకు అతేడే టాప్ స్కోరర్.  ఇదే దూకుడు కొనసాగిస్తే ఇక కోహ్లీని అడ్డుకోవడం కష్టమే. అదే జరిగితే రాబోయే  దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సిరీస్ లతో పాటు అక్టోబర్ లో జరుగబోయే టీ20  ప్రపంచకప్ లో కోహ్లీ మేనియా ఏ విధంగా ఉంటుందో  ఊహించుకోవచ్చు. 

 

అజ్జాతవాసం ముగిసినట్టేనా..?

నెల రోజుల విరామం తర్వాత ఆడిందే మూడు మ్యాచులు.. అందులో ఒకటి హాంకాంగ్ మీదే. ఈ మూడు ఇన్నింగ్స్ లో ఆటను చూసి  కోహ్లీ ఫామ్ లోకి వచ్చాడని నిర్దారించుకోవాలా..? అనే ప్రశ్న  వేసేవాళ్లూ లేకపోలేదు. హాంకాంగ్ ను మినహాయిస్తే పాకిస్తాన్ తో రెండు మ్యాచుల్లోనూ కోహ్లీ ఆటను చూస్తే అతడు మునపటి లయను అందుకున్నాడని ఇట్టే చెప్పొచ్చు. అన్నింటికీ మించి కోహ్లీ బ్యాటింగ్ చేసేప్పుడు  ఒకరకమైన అటిట్యూడ్ తో ఉంటాడు. గడిచిన మూడు మ్యాచుల్లో  కోహ్లీ ఇన్నింగ్స్ ను గమనిస్తే దానిని స్పష్టంగా గమనించవచ్చు. అదొక్కటి చాలు, కింగ్ ఈజ్ బ్యాక్ అని చెప్పడానికి.. అజ్ఞాతవాసాన్ని ముగించుకుని రాజు తిరిగి తన రాజ్యానికి వచ్చాడు.. ఇక మళ్లీ తన రాజ్యాన్ని ఏలడమే తరువాయి... 

Follow Us:
Download App:
  • android
  • ios