ICC Under-19 World Cup 2022: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లితో పాటు గతంలో యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్ వంటి ఆటగాళ్లంతా అండర్-19 ప్రపంచకప్ లో మెరిసి భారత సీనియర్ జట్టు తలుపు తట్టినవాళ్లే..
అండర్-19 ప్రపంచకప్ లో అదరగొడుతున్న యువ భారత్ ఆటగాళ్లపై ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్ లో ఇరగదీస్తున్న కెప్టెన్ యశ్ ధుల్, హర్నూర్ సింగ్, రఘువంశీలతో పాటు ఆల్ రౌండర్ రాజవర్ధన్ హంగర్గేకర్ లు మెరుగైన ప్రదర్శనలతో అలరిస్తున్నారు. అండర్-19 ప్రపంచకప్ లో భాగంగా బుధవారం ఆస్ట్రేలియాతో ముగిసిన సెమీఫైనల్ మ్యాచులో యువ భారత్ ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ సారథి మైకేల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యశ్ ధుల్ బ్యాటింగ్ పై అతడు ప్రత్యేక ప్రశంసలు కురిపించాడు.
ఆస్ట్రేలియాతో మ్యాచులో టీమిండియా ఇన్నింగ్స్ ముగిశాక ట్విట్టర్ వేదికగా వాన్ స్పందించాడు. ‘ఇండియా అండర్-19 జట్టు బ్యాటింగ్ ప్రదర్శన ఉన్నత స్థాయిలో ఉంది. భారత జట్టు భవిష్యత్ భద్రంగా ఉంది. ముఖ్యంగా యశ్ ధుల్ అసాధారణంగా కనిపిస్తున్నాడు...’ అని ట్వీట్ చేశాడు.
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లితో పాటు గతంలో యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్ వంటి ఆటగాళ్లంతా అండర్-19 ప్రపంచకప్ లో మెరిసి టీమిండియా సీనియర్ జట్టు తలుపు తట్టినవాళ్లే. ఈ జాబితాలో ఇప్పుడు యశ్ ధుల్ కూడా చేరబోతున్నాడు. త్వరలో జరుగబోయే మెగా వేలంలో అతడు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాడనడంలో సందేహమే లేదు.
ఇదిలాఉండగా.. నిన్నటి సెమీస్ మ్యాచులో 37 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను సారథి యశ్ ధుల్ (110) ఆదుకున్నాడు. వైస్ కెప్టెన్ షేక్ రషీద్ (94) తో కలిసి అతడు మూడో వికెట్ కు 204 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోవడంతో బాధ్యతాయుతంగా ఆడిన ధుల్ బ్యాటింగ్ శైలి భారత మాజీ సారథి విరాట్ కోహ్లిని తలపించింది.
ముఖ్యంగా ధుల్ ఆడిన కొన్ని కట్ షాట్లు, లేట్ కట్ లు, స్ట్రెయిట్ డ్రైవ్ లు చూస్తే అచ్చం విరాట్ ను దింపేశాడు అనిపించక మానదు. పేసర్లను ధీటుగా ఎదుర్కునే ధుల్.. స్పిన్నర్లను కూడా బాగా ఆడగల సమర్థుడు. ఇక ప్రపంచకప్ టోర్నీలో భాగంగా ఐర్లాండ్ తో లీగ్ మ్యాచుకు ముందు ధుల్ తో పాటు మరో నలుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. కానీ కీలకమైన క్వార్టర్స్ మ్యాచులో యశ్ తో పాటు రషీద్ ఇతర ఆటగాళ్లు కరోనా నుంచి కోలుకున్నారు. క్వార్టర్స్ లో డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్ ను చిత్తు చేసిన యువ భారత్.. సెమీస్ లో ఆసీస్ ను ఓడించింది.
సెమీస్ లో టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ తీసుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 290 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఆసీస్ ను 41.5 ఓవర్లలో 194 పరుగులకే కట్టడి చేసింది. భారత స్పిన్నర్లు విక్కీ ఓస్త్వాల్ (3 వికెట్లు), నిశాంత్ సింధు (2 వికెట్లు), కౌశల్ తాంబే (1 వికెట్), రఘువంశీ (1 వికెట్) రాణించారు. ఆసీస్ బ్యాటర్లలో ఎనిమిది వికెట్లు స్పిన్నర్లకే దక్కడం గమనార్హం. సెమీస్ లో గెలిచిన భారత జట్టు.. శనివారం ఫైనల్ లో ఇంగ్లాండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది.
