టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దాదాపు 9 సంవత్సరాల క్రితం ఆడిన ఓ బంతి.. ఇప్పుడు మళ్లీ దొరికింది.  2011 ఏప్రిల్ 2వ తేదీన టీమిండియా రెండో సారి వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ అప్పటి ఫైనల్ మ్యాచ్ లో కులశేఖర వేసిన బంతిని భారీ సిక్సర్ గా మార్చి ధోనీ మ్యాచ్ ని గెలిపించాడు. అయితే.. అప్పుడు కొట్టిన బంతి.. వెతికినా దొరకలేదు. కాగా.. ఇప్పుడు దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఈ విషయంలో తాను సహకారం అందిస్తానని చెప్పారు.


ఆ మ్యాచ్‌లో ధోని  కొట్టిన బంతిని అందుకున్న అభిమాని గురించి తనకు తెలుసని, తన మిత్రుడు ఒకరికి అతనితో పరిచయం ఉందని గావస్కర్‌ ఎంసీఏ ( ముంబయి క్రికెట్ సంఘం)కు తెలియజేశారు. దాంతో ఎంసీఏ ఇతర ఏర్పాట్లు చేసేందుకు సన్నద్ధమైంది. సదరు వ్యక్తి ఆ మ్యాచ్‌ టికెట్‌తో సహా బంతిని ఒకగుర్తుగా ఇంట్లో భద్రపరచినట్లు సమాచారం.

 ఆ బంతి ఎంసీఏ పెవిలియన్‌ స్టాండ్, ఎల్‌ బ్లాక్‌లోని 210 నంబర్‌ సీటుపై పడింది. ఇప్పుడు ఆ సీటును ఇతర సీట్లకంటే భిన్నంగా ఉండేలా, ప్రత్యేకంగా కనిపించేలా సిద్ధం చేసి ధోని పేరుతో దానిని గుర్తుగా మార్చనున్నారు. 

ఈ తరహాలో అంకితం చేయడం భారత్‌లో తొలిసారి అయినా గతంలోనూ క్రికెట్‌లో ఇలా జరిగాయి. ఆ్రస్టేలియా ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో సైమన్‌ ఒడొనెల్‌ 122 మీటర్ల సిక్స్‌ కొట్టిన సీటును, బిగ్‌ బాష్‌లో బ్రాడ్‌ హాడ్జ్‌ చివరి మ్యాచ్‌ ఆడినప్పుడు కొట్టిన 96 మీటర్ల సిక్సర్‌ సీటును ఇలాగే మార్చారు. 2015 ప్రపంచకప్‌ సెమీస్‌లో స్టెయిన్‌ బౌలింగ్‌లో గ్రాంట్‌ ఇలియట్‌ కొట్టిన సిక్సర్‌తో న్యూజిలాండ్‌ తొలిసారి ఫైనల్‌ చేరగా...ఆక్లాండ్‌లో ఆ సీటును ఇలాగే మార్చారు.