Asianet News TeluguAsianet News Telugu

The Ashes: గబ్బాలో తొలి దెబ్బ ఎవరిది..? రేపటినుంచే యాషెస్.. ‘బూడిద’ కోసం కొట్టుకోనున్న అగ్రజట్లు

Australia Vs England: ‘బూడిద పోరు’గా ప్రపంచానికి పరిచయమైన ఈ సిరీస్ కోసం రెండు దేశాల క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచ క్రికెట్ ప్రేమికులు కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

The Ashes: Australia Vs England First Test Match Preview
Author
Hyderabad, First Published Dec 7, 2021, 8:06 PM IST

ప్రతిష్టాత్మక సిరీస్ కు మరికొద్దిగంటల్లో తెరలేవనుంది. క్రికెట్ ప్రపంచంలో అత్యంత పురాతన వైరంగా పేరొందిన Ashes సిరీస్ కు సర్వం సిద్ధమైంది. రెండేండ్లకోసారి జరిగే ఈ కీలక పోరులో  తలపడటానికి రెండు  అగ్రశ్రేణి క్రికెట్ జట్లు  సిద్ధమయ్యాయి. ‘బూడిద పోరు’గా ప్రపంచానికి పరిచయమైన ఈ సిరీస్ కోసం రెండు దేశాల క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మేజర్ టోర్నీలు, ఆఖరకు ప్రపంచకప్ లో  ఓడినా పెద్దగా పట్టించుకోరు గానీ యాషెస్ లో ఓడితే మాత్రం ఇరు దేశాల అభిమానుల నుంచి క్రికెటర్లు తీవ్రమైన నిరసనను ఎదుర్కొంటారు. ఇంతటి ప్రతిష్ట కలిగిన ఈ సిరీస్ రేపటినుంచి గబ్బా వేదికగా జరిగే తొలి టెస్టుతో ప్రారంభం కానున్నది. 

బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా జరిగే తొలి టెస్టుకు ఇరు జట్లు తమ తుది జట్టును ప్రకటించాయి. రెండేండ్ల క్రితం జరిగిన యాషెస్ ను ఆసీస్ కైవసం చేసుకోగా.. తాజాగా జరిగే సిరీస్ ను ఎవరు గెలుచుకుంటారు..? అని క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. భారత కాలమానం ప్రకారం.. ఉదయం 5.30 గంటల నుంచి తొలి టెస్టు మొదలుకానున్నది.

అసలు పేరేలా వచ్చిందంటే...? 

‘ప్రతి రెండేండ్ల కోసం ఆసీస్-ఇంగ్లాండ్ బూడిద కోసం కొట్టుకుంటాయి’ అని  పత్రికలలో కథనాలు చూసే ఉంటారు. అసలు  ఈ సిరీస్ కు ఆ పేరెలా వచ్చిందంటే.. 1882 ఆగస్టు 29న ఓవల్ స్టేడియంలో జరిగిన  ఓ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లీష్ జట్టు  అనూహ్యంగా ఓడింది. ఇంగ్లాండ్ పై ఆసీస్ కు ఇదే మొదటి విజయం. దీంతో ఓ ఆంగ్ల పత్రిక.. ఇంగ్లాండ్  క్రికెట్ చచ్చిపోయిందనే ఉద్దేశంతో ‘అంత్యక్రియలు జరుపగా వచ్చిన బూడిదను ఆస్ట్రేలియాకు తీసుకెళ్తారు..’ అని ఓ సంచలనాత్మక కథనాన్ని రాసింది.  ఇక 1883లో ఇంగ్లాండ్ ఆసీస్ పర్యటనకు వెళ్లినప్పుడు పలు ఇంగ్లీష్ పేపర్లు.. ‘యాషెస్ ను తిరిగి తీసుకురండి..’ అని రాశాయి. అప్పట్నుంచి ఆసీస్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ కు ‘ది యాషెస్’ అనే పేరు స్థిరపడిపోయింది.

శపథం.. పెళ్లి 

అయితే కొన్ని వారాల తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ ఇవో బ్లిగ్.. ఒక పత్రికలో ఇంటర్వ్యూ ఇస్తూ ‘నేను ఆస్ట్రేలియా నుంచి అదే బూడిద తీసుకొస్తా..’ అని శపథం చేశాడు. ఇందుకు కౌంటర్ గా కంగారూల సారథి మర్డోక్ సైతం.. అంత సీన్ లేదు, విజయం మాదే అని వ్యాఖ్యానించాడు. సవాళ్లు ప్రతిసవాళ్ల మధ్య రసవత్తరంగా సాగిన సిరీస్ లో ఇంగ్లాండ్  దే పైచేయి అయింది. మూడు మ్యాచ్ ల సిరీస్ ను ఇంగ్లాండ్ 2-1తో గెలిచింది.  ఇక ఇప్పుడు శాపనార్థాలు పెట్టడం ఆసీస్ అభిమానుల వంతు. ఓటమిని జీర్ణించుకోని ఆసీస్ అభిమానులు.. ముఖ్యంగా మహిళలు.. చివరి టెస్టులో వాడిన బెయిల్స్ ను  కాల్చి ‘ఇది ఆసీస్ క్రికెట్ బూడిద’ అంటూ బ్లిగ్ కు  అందించారు. ఒక టెర్రాకోట పాత్రలో దానిని నింపి ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇవో బ్లిగ్.. తన జీవిత భాగస్వామి ఫ్లోరెన్స్ మార్ఫీని కలుసుకున్నాడు. ఇద్దరి మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. 

ఆసీస్ కు కొత్త శకం.. 

ఆస్ట్రేలియా క్రికెట్ కు కచ్చితంగా ఇది కొత్త శకం. 1956 తర్వాత ఆ జట్టుకు ఒక బౌలర్ కెప్టెన్ అయ్యాడు  లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొని  కెప్టెన్సీ కోల్పోయిన టిమ్ పైన్ స్థానంలో ఆ జట్టు పేసర్ పాట్ కమిన్స్  సారథ్య బాధ్యతలు మోస్తున్నాడు.  ఆసీస్ కు అతడు 47వ కెప్టెన్. స్టీవ్ స్మిత్ వైస్ కెప్టెన్ అయ్యాడు. టిమ్ పైన్ ఉదంతంతో షాక్ కు గురైన ఆసీస్.. దాన్నుంచి ఎలా బయటపడుతుందనేది ఇప్పుడు  ఆసక్తిగా మారింది.  అయితే ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ లో ఆ జట్టు విజయం సాధించడం.. ఆ జట్టుకు కొత్త ఊపునిచ్చింది. ఇది కచ్చితంగా ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. బ్యాటింగ్ లో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, లబూషైన్, మార్కస్ హారిస్ లతో పటిష్టంగా కనిపిస్తున్న ఆసీస్..  మిచెల్ స్టార్క్, కమిన్స్, నాథన్ లియాన్, హెజిల్వుడ్ ల బౌలింగ్ లైనప్ తో బలంగా ఉంది. 

ఇంగ్లాండ్ కు షాక్.. 

తొలి టెస్టు ఆరంభానికి ముందే ఇంగ్లాండ్ కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేసర్ జేమ్స్ అండర్సన్.. గబ్బా టెస్టులో ఆడటం లేదు. స్టువర్ట్ బ్రాడ్ కూడా అనుమానంగానే ఉన్నా అతడి ఫామ్ పైనా సందిగ్దం నెలకొంది. ఇక ఆర్నెళ్ల తర్వాత గ్రౌండ్ లోకి అడుగుపెడుతున్న బెన్ స్టోక్స్ ఏమేరకు ప్రభావం చూపుతాడో చూడాల్సి ఉంది. బ్యాటింగ్ లో రూట్,  డేవిడ్ మలన్, బెన్ స్టోక్స్,  బట్లర్ తో పటిష్టంగానే కనిపిస్తున్నా ఆసీస్ పిచ్ లపై వీళ్లు  ఏ మేరకు రాణిస్తారో చూడాలి.  బ్రాడ్ తో పాటు మార్క్ వుడ్, బెన్ స్టోక్ష్, రాబిన్సన్ బౌలింగ్ భారాన్ని మోస్తున్నారు. 

ఇంకొంత : 

- తొలి టెస్టు జరిగే బ్రిస్బేన్ లో 1986 నుంచి ఇంగ్లాండ్ ఒక్క టెస్టు కూడా గెలువలేదు.
- ఆసీస్ లో రూట్ ఇంతవరకు సెంచరీ (టెస్టుల్లో) చేయలేదు. ఆస్ట్రేలియా గడ్డ మీద  17 టెస్టులు ఆడిన రూట్.. 38 సగటు నమోదు చేశాడు. ఆరు అర్థసెంచరీలు మాత్రమే చేసినా వాటిని సెంచరీలుగా మలచలేకపోయాడు. ఆసీస్ లో రూట్ అత్యధిక స్కోరు 87 పరుగులు. 
- గత రెండు యాషెస్ సిరీస్ లలో స్మిత్ రఫ్ఫాడించాడు. గత 14 ఇన్నింగ్సులలో అతడు 121.75 సగటుతో ఏకంగా 1,461 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలున్నాయి. 
- రేపటి టెస్టులో ఒక్క వికెట్ పడగొడితే  ఆస్ట్రేలియన్ స్పిన్నర్ టెస్టుల్లో 400 వికెట్ల క్లబ్ లో చేరతాడు. షేన్ వార్న్, గ్లెన్ మెక్గ్రాత్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో బౌలర్ అవుతాడు. మొత్తంగా ఈ ఘనత సాధించే 17వ టెస్టు బౌలర్ గా రికార్డులకెక్కుతాడు. 
 

తుది జట్లు : 
ఆస్ట్రేలియా :
డేవిడ్ వార్నర్, మార్కస్ హరిస్, లబూషైన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ కేరీ, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హెజెల్వుడ్

ఇంగ్లాండ్ : రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలన్, జో రూట్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, ఓలి పోప్, జోస్ బట్లర్, క్రిస్ వోక్స్, ఒలి రాబిన్సన్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్

Follow Us:
Download App:
  • android
  • ios