Asianet News TeluguAsianet News Telugu

The Ashes: ఉస్మాన్ ఖవాజా సెంచరీ.. భారీ స్కోరు సాధించిన కంగారూలు.. ఇంగ్లాండ్ పరువు దక్కించుకునేనా..?

Australia Vs England: సుమారు  రెండున్నరేండ్ల పాటు జట్టులో స్థానం కోల్పోయిన ఉస్మాన్ ఖవాజా.. యాషెస్ లో చెలరేగి ఆడాడు. సిడ్నీ టెస్టులో సెంచరీ చేసి కంగారూలను పటిష్ట స్థితిలో నిలిపాడు.

The Ashes 2021-22: Usman Khawaja Shines With Century At Sydney Test, As Australia Declared The Innings at 416-8
Author
Hyderabad, First Published Jan 6, 2022, 3:08 PM IST

యాషెస్ సిరీస్ లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. రెండో రోజు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించినా ఏకాగ్రత కోల్పోకుండా ఆడింది. సుమారు రెండున్నరేండ్ల తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చిన మిడిలార్డర్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా.. తాను ఎంత విలువైన ఆటగాడినో మరోసారి చాటాడు.  కెరీర్ లో తొమ్మిదో సెంచరీ చేసి  సిడ్నీ టెస్టులో ఆసీస్ ను పటిష్ట స్థితిలో నిలిపాడు. ఉస్మాన్ ఖవాజా (137) సెంచరీతో పాటు స్టీవ్ స్మిత్ (67) కూడా రాణించడంతో ఆ జట్టు రెండో రోజు ఆట ముగుస్తుందనగా.. 416 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.  ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్.. 5 వికెట్లు తీసుకున్నాడు. 

ఓవర్ నైట్ స్కోరు 126-3 వద్ద రెండో రోజు ఆట  ప్రారంభించిన ఆసీస్ నిలకడగా ఆడింది. ఆ జట్టు వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (141 బంతుల్లో 67) తో కలిసి ఉస్మాన్ ఖవాజా (260 బంతుల్లో 137)  నాలుగో వికెట్ కు 125 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఇద్దరూ కలిసి ఇంగ్లీష్ పేస్ ద్వయం స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ తో పాటు మార్క్ వుడ్, బెన్ స్టోక్స్, స్పిన్నర్ జాక్ లీచ్ లను సమర్థంగా ఎదుర్కున్నారు.  ఫలితంగా ఆసీస్ భారీ స్కోరుపై కన్నేసింది. 

కానీ స్టువర్ట్ బ్రాడ్ ఈ జోడీని విడదీశాడు. ముందుగా 83.6 ఓవర్లో స్మిత్ ను  పెవిలియన్ కు పంపాడు.  స్మిత్ ఔటయ్యక.. గ్రీన్ (5), అలెక్స్ కేరీ (13) వెంటవెంటనే నిష్క్రమించినా  ఖవాజా  ఏకాగ్రత కోల్పోలేదు.  ఆసీస్ సారథి పాట్ కమిన్స్ (47 బంతుల్లో 24) తో కలిసి కీలక పరుగులు సాధించాడు. 

 

ఇక ఈ టెస్టులో  ట్రావిస్ హెడ్ కు కరోనా సోకడంతో సిడ్నీలో స్థానం దక్కించుకున్న  సెంచరీ సాధించాడు. స్మిత్ తప్ప మిగిలిన బ్యాటర్లంతా నామమాత్రపు స్కోర్లకే  పరిమితమవగా.. ఖవాజా మాత్రం మూడంకెల స్కోరు సాధించాడు. తన టెస్టు కెరీర్ లో తొమ్మిదో సెంచరీ సాధించాడు. శతకం సాధించిన వెంటనే అతడు డగౌట్లలో ఉన్న తన భార్య రేచల్, కూతురును చూస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు.  

కమిన్స్ నిష్క్రమించిన తర్వాత కూడా మిచెల్ స్టార్క్ (60 బంతుల్లో 34 నాటౌట్) తో కలిసి 55 పరుగులు జోడించాడు. అయితే బ్రాడ్ ఆ తర్వాత ఖవాజాను బౌల్డ్ చేశాడు. ఖవాజా నిష్క్రమించిన తర్వాత కొద్దిసేపటికే కమిన్స్.. ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్ 5 వికెట్లు తీయగా.. అండర్సన్, వుడ్, కెప్టెన్ జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.  

 

ఆఖర్లో ఇంగ్లాండ్ కు బ్యాటింగ్ కు రప్పించి  ఒకటో రెండో వికెట్లు పడగొడదామనుకున్న కమిన్స్ వ్యూహాం ఫలించలేదు.  5 ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్ ఓపెనర్లు హసీబ్ హమీద్ (2 బ్యాటింగ్), జాక్ క్రాలే (2 బ్యాటింగ్) లు వికెట్ సమర్పించుకోలేదు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 13 పరుగులు  చేసింది. 

ఇప్పటికే ఈ సిరీస్ లో గడిచిన 3 టెస్టులలో ఆసీస్ విజయం సాధించిన కంగారూలు  యాషెస్ దక్కించుకున్న విషయం తెలిసిందే. మిగిలిన రెండె టెస్టులలో అయినా  మెరుగ్గా ఆడి  పరువు దక్కించుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తున్నది. కానీ ప్రస్తుత ఇంగ్లాండ్ ఫామ్, వాతావారణ పరిస్థితులు దానికి ఏమాత్రం అనుకూలంగా లేవు. మరి మూడో రోజైన రేపు ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఎలా ఆడతారనేది ఇప్పుడు ఇంగ్లీష్ అభిమానులను వేధిస్తున్న ప్రశ్న.

Follow Us:
Download App:
  • android
  • ios