Asianet News TeluguAsianet News Telugu

Ashes: జోస్ బట్లర్ కళ్లు చెదిరే క్యాచ్.. బెన్ స్టోక్స్ బౌన్సర్లు.. నిలకడగా ఆడుతున్న ఆసీస్

Australia Vs England: అడిలైడ్ లో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. వికెట్ కీపర్ జోస్ బట్లర్ స్టన్నింగ్ క్యాచ్ తో, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్  బౌన్సర్లతో అదరగొడుతున్నారు. 

The Ashes 2021-22: England Wicket Keeper Jos Buttler Grabs Stunning Catch In  2nd Test
Author
Hyderabad, First Published Dec 16, 2021, 3:15 PM IST

యాషెస్ సిరీస్ లో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న  డే అండ్  నైట్ టెస్టులో  ఇంగ్లాండ్ ఆటగాళ్లు మెరుపులు మెరిపిస్తున్నారు. వికెట్ కీపర్ జోస్ బట్లర్ స్టన్నింగ్ క్యాచ్ తో, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్  బౌన్సర్లతో అదరగొడుతున్నారు.  ఆసీస్ ఇన్నింగ్స్ ప్రారంభంలో  బట్లర్.. ముందుకు దూకుతూ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. ఇక  రెండ్రోజుల క్రితం ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ కు తన బౌన్సర్లను రుచి చూపించిన బెన్ స్టోక్స్.. ఇప్పుడు వాటిని కంగారూల మీదకు సందిస్తున్నాడు.  బౌన్సర్ల ధాటికి డేవిడ్ వార్నర్,  లబూషేన్ విలవిల్లాడుతున్నారు. 

ఆసీస్ ఇన్నింగ్స్ లో 8వ ఓవర్లో  స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ చేస్తున్నాడు.  బ్యాట్ మీదకు వచ్చిన బంతిని బ్యాటర్  మార్కస్ హారిస్.. లెగ్ సైడ్ దిశగా ఆడాడు. ఆ బంతి కాస్తా ఎడ్జ్ కు తాక  వికెట్  కీపర్ కు దూరంగా వెళ్లింది. అసలు కీపర్ కు ఆ క్యాచ్ అందడం అసంభవం. కానీ  బట్లర్ మాత్రం దానిని అద్భుతంగా అందుకున్నాడు. 

 

ఈ క్రమంలో బట్లర్ ముందుకు డైవ్ చేస్తూ అద్భుతంగా  క్యాచ్ అందుకున్నాడు.  సూపర్ మాన్ లా ముందుకు దూకుతూ ఒంటి చేత్తో క్యాచ్ ఒడిసిపట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.దీంతో ఇది చూసిన నెటిజన్లంతా బట్లర్ ను సూపర్ మాన్ అంటూ  ప్రశంసల్తో ముంచెత్తుతున్నారు. ఇదే సమయంలో ఐపీఎల్ లో బట్లర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజస్థాన్ రాయల్స్ కూడా ఈ క్యాచ్ పై ఓ సూపర్ పోస్ట్ చేసింది. బట్లర్ ను స్పైడర్  మాన్ తో పోల్చుతూ.. ఫోటోను షేర్ చేసింది. 

ఇక రెండ్రోజుల క్రితం ప్రాక్టీస్ సెషన్ లో ఇంగ్లాండ్ సారథి జో రూట్ కు బౌన్సర్ వేసిన బెన్  స్టోక్స్.. తాజాగా వాటిని ఆసీస్ బ్యాటర్లకు సందిస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్ లో స్టోక్స్ వేసిన బౌన్సర్ రూట్ హెడ్ కు బలంగా తాకింది. తలకు  హెల్మెట్ లేకుంటే రూట్ కు  పెద్ద గాయమయ్యేదే.  

 

140 కిలోమీటర్ల వేగంతో బెన్ స్టోక్స్ వస్తున్న బౌన్సర్లను తప్పించుకోవడానికి  ఆసీస్ బ్యాటర్లు  డేవిడ్ వార్నర్,  మార్నస్ లబూషేన్ లు విలవిల్లాడారు. వాటిని ఎదుర్కునే క్రమంలో  ఇద్దరు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా  హారిస్ నిష్క్రమించిన తర్వాత   ఆసీస్ ను ఒత్తిడిలోకి నెట్టడానికి రూట్.. స్టోక్స్ తో ఎక్కువ ఓవర్లు వేయించాడు. 

కానీ ఎంతగా రెచ్చగొట్టినా ఆసీస్ ఓపెనర్ వార్నర్ తో పాటు లబూషేన్  మాత్రం  ఎక్కడా ఒత్తిడికి లోనుకాకుండా నిలకడగా ఆడుతున్నారు. ఆట మూడో సెషన్ లో 58 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్.. ఒక వికెట్ నష్టానికి 144 పరుగులు చేసింది. 148 బంతులాడిన వార్నర్.. 75 పరుగులు చేశాడు. ఇందులో 8  బౌండరీలున్నాయి. ఇక 176 బాల్స్ ఆడిన లబూషేన్.. 58 రన్స్ చేశాడు. స్టువర్ట్ బ్రాడ్ కు ఒక వికెట్ దక్కింది. ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్.. ఇప్పటివరకు 13 ఓవర్లు (18 పరుగులిచ్చాడు) బౌలింగ్ చేయగా.. అందులో 6 మెయిడిన్లే కావడం  గమనార్హం. 

Follow Us:
Download App:
  • android
  • ios