పాకిస్థాన్ యంగ్ బౌలర్ హసన్ అలీ మరికొన్ని గంటల్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తమ దాయాది దేశం భారత్ కు చెందిన యువతితో హసన్ కొన్నాళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న అతడు పెళ్లిపీటలెక్కేందుకు సిద్దమయ్యాడు. వారిద్దరి వివాహం కుటుంబసభ్యులు, కొందరు సన్నిహితుల సమక్షంలో మంగళవారం రాత్రి జరగనుంది. అధికారికంగా ఈ పెళ్లికి సంబంధించి ఎలాంటి సమాచారం లేకున్నా హసన్ అలీ ట్వీట్ ద్వారా ఈ  విషయం తెలుస్తోంది. 

''గత రాత్రితో  నా బ్యాచిలర్ జీవితం ముగిసింది. జీవితంలో మరికొంత ముందుకు వెళ్లి దాంపత్య జీవితంలో అడుగుపెట్టబోతున్నా.'' అంటూ హసన్ అలీ తన పెళ్లికి సంబంధించిన వివరాలను పరోక్షంగా బటయపెట్టాడు. ఇలా అతడు ఇదే చివరి బ్యాచిలర్ రాత్రి అంటూ చేసిన ట్వీట్ పై హైదరాబాదీ టెన్నిస్ ప్లేయర్,షోయబ్ మాలిక్ భార్య సానియా మీర్జా స్పందించారు. 
 
'' శుభాకాంక్షలు హసన్. పెళ్ళిబంధంతో ఒక్కటికానున్న మీ జంట కలకాలం ఇలాగే ప్రేమానురాగాలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నా. ఈ సందర్భంగా నువ్వు ఘనంగా  ట్రీట్ ఇవ్వాల్సివుంటుంది.'' అంటూ సానియా హసన్ అలీకి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 

హసన్ అలీ భారత సంతతికి చెందిన షమియా అర్జూను వివాహమాడనున్నాడు. ఇంగ్లాండ్ లో నివాసముంటున్న అర్జూ ప్రస్తుతం ఎమిరేట్స్ విమానయాన సంస్ధలోఫ్లైట్ ఇంజనీర్ గా  పనిచేస్తోంది.అయితే ప్రపంచ కప్ ఆడేందుకు ఇంగ్లాండ్ కు వెళ్లిన హసన్ కు అర్జూతో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఆ ప్రేమను అతికొద్ది కాలంలోనే పెళ్లి పీటలపైకి తీసుకెళ్లి దంపతులుగా మారుతున్నారు. దుబాయ్ లోని  ఓ ప్రముఖ హోటల్లో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది అతిథుల సమక్షంలో ఈ  పెళ్లి  జరగనుంది. 

హైదరాబాద్ కు చెందిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ను పాక్ మాజీ  క్రికెటర్ షోయబ్ మాలిక్ పెళ్లాడిన విషయం తెలిసిందే. ఇలా ఇప్పటికే పాక్ క్రికెటర్లు షోయబ్ మాలిక్, జహీర్ అబ్బాస్, మొహసీన్ ఖాన్ లు భారత్ కు చెందిన అమ్మాయిలనే పెళ్లాడారు. వీరి సరసకు ఇప్పుడు హసన్ అలీ చేరిపోయాడు. 
 

సంబంధిత  వార్త

భారతీయ యువతితో పాక్ క్రికెటర్ ప్రేమాయణం...