మరో పాకిస్థానీ క్రికెటర్ భారత యువతిని పెళ్లాండేందుకు సిద్దమయ్యాడు. పాకిస్థాన్ యువ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ ఇప్పటికే భారత్ కు చెందిన యువతితో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నట్లు సమాచారం. ఆ యువతినే అతడు ఆగస్ట్ 20వ తేదీన దుబాయ్ లో పెళ్లాడనున్నట్లు తెలుస్తోంది. ఈపెళ్లి వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు కొంత మంది ప్రత్యేక అతిథుల సమక్షంలో జరగనుంది. ఈ వేడుక అట్లాంటిస్ ఫామ్ హోటల్లో జరగనున్నట్లు హసన్ అలీ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. 

ఇంగ్లాండ్ వేదికన జరిగిన ప్రపంచ కప్ సమయంలోనే హర్యానాకు చెందిన షామియా అర్జు(25) తో హసన్ అలీకి పరిచయం ఏర్పడిందట. ఇంగ్లాండ్ లోని మానవ్ రచన యూనివర్సిటీ నుండి షామియా ఏరోనాటికల్ ఇంజనీరింగ్  పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ లో ఇంజనీర్ గా పనిచేస్తోంది. అయితే ఇటీవల ప్రపంచ కప్ కోసం ఇంగ్లాండ్ కు వెళ్లిన హసన్ అలీ కి ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా షామియా పరిచమయ్యిందట. 

అలా వీరిద్దరి పరిచయం చాలా తక్కువ సమయంలోనే ప్రేమగా మారింది. రెండు నెలలుగా వీరి మనసులు మరింత దగ్గరవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు అంగీకరించడంతో పెళ్లికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. 

ఇప్పటికే హైదరాబాద్ కు చెందిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ను పాక్ మాజీ  క్రికెటర్ షోయబ్ మాలిక్ పెళ్లాడిన విషయం తెలిసిందే. అయితే భారత్-పాక్ ల మధ్య ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా సానియా విమర్శలపాలవుతుంటారు. అలా ఎప్పుడూ భారత అభిమానుల నుండి విమర్శలను ఎదుర్కొనే సానియా ప్రపంచ కప్ సందర్భంగా పాక్ క్రికెట్ ఫ్యాన్స్ నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. 

ఇక షోయబ్ మాలిక్, హసన్ అలీలే కాకుండా మాజీ క్రికెటర్లు జహీర్ అబ్బాస్, మొహసీన్ ఖాన్ లు కూడా భారత్ కు చెందిన అమ్మాయిలనే పెళ్లాడారు. కానీ మాలిక్-
సానియా మీర్జా మాదిరిగా వీరెవరూ ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకోలేదు.