అంబటి రాయుడు రిటైర్మెంట్ తర్వాత టీమిండియాలో తెలుగు రాష్ట్రాలకు అసలు ప్రాతినిద్యమే లేకుండా పోయింది. అయితే ఆ  లోటును పూడ్చటానికి ఓ తెలుగు యువ కెరటం సిద్దమయ్యాడు. వెస్టిండిస్ పర్యటన కోసం నిన్న(ఆదివారం) భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ టూర్ కు ధోని దూరమవడంతో అతడి స్థానాన్ని భర్తీ చేయడానికి ఈ తెలుగు క్రికెటర్ పేరును సెలెక్టర్లు పరిశీలించారంటే అతడి ఆటతీరు ఏ స్థాయిలో వుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇలా సెలెక్టర్ దృష్టిలో పడ్డ ఆ ఆటగాడు మరెవరో కాదు విశాఖపట్నానికి చెందిన కోన శ్రీకర్ భరత్. 

భరత్ గురించి ఎమ్మెస్కే ఏమన్నాడంటే

భారత్-ఎ తరపున అదరగొడుతున్న కేఎస్ భరత్ ను విండీస్ టూర్ కు ఎంపిక చేయాలని చాలా ప్రయత్నించినట్లు చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే తెలిపాడు. అయితే ధోని స్థానంలో ప్రధాన వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ను ఎంపికచేశాం. అయితే బ్యాకప్ వికెట్ కీపర్ గా అయినా భరత్ ను ఎంపికచేయాలని ముందుగా అనుకున్నాం. కానీ విండీస్ తో జరగనున్న సుదీర్ఘ పర్యటనలో అనుభవం చాలా అవసరమవుతుంది కావున వృద్దిమాన్ సాహాకు అవకాశమిచ్చినట్లు ఎమ్మెస్కే వెల్లడించారు.

ఇక ఇదే భారత-ఎ జట్టు ప్రదర్శన ఆదారంగానే మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యార్, నవదీప్ సైనీలు ఎంపికయ్యారని తెలిపారు. ఈ క్రమంలోనే భరత్ పేరు కూడా చర్చకు వచ్చింది. అయితే ఇటీవలే గాయపడి తిరిగి ఫిట్ నెస్ సాధించిన వృద్దిమాన్ సాహాన్ కు మరోసారి అవకాశమివ్వాలని భావించడంతో భరత్ ఆంతర్జాతీయ జట్టులోకి చేరే అవకాశాన్ని  కోల్పోయాడని తెలిపారు. అయితే అతడి అద్భుత ఆటతీరుతో తమ దృష్టిల్లో పడ్డాడని...  రిషబ్, సాహాలతో పాటు భరత్ పేరు ఇక తదుపరి కూడా తమ పరిశీలనలో వుంటుందని ఎమ్మెస్కే పేర్కోన్నాడు. 

భరత్ గురించి రాహుల్ ద్రవిడ్ స్పందన 

ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రాణిస్తూ కోచ్ రాహుల్ ద్రవిడ్ దృష్టిల్లో పడి మరింత అద్భతమైన ఆటగాడిగా మారాడు భరత్. పలు సందర్భాల్లో ద్రవిడ్ స్వయంగా భరత్ ను  టీమిండియా తరపున ఆడే అన్ని లక్షణాలున్నాయని ప్రశంసించాడు కూడా. అయితే ఆ అవకాశం వెస్టిండిస్ పర్యటన ద్వారా వచ్చినట్లే వచ్చి చేజారిపోవడం తెలుగు ప్రజలను కాస్త నిరాశకు గురిచేసింది. 

భరత్ ప్రదర్శన

భారత్-ఎ జట్టు తరపున 65 ఫస్ట్  క్లాస్ మ్యాచులాడిన భరత్ 3,798 పరుగులు సాధించాడు. ఇక వికెట్ కీపర్ గా కూడా అతడికి మంచి ట్రాక్ రికార్డే వుంది. ఇక ఇటీవల జరిగిన పలు మ్యాచుల్లో చెలరేగి ఆడిన భరత్ సెలక్టర్ల దృష్టిల్లో పడ్డాడు. అయితే దురదృష్టం వెంటాడటంతో ఏడాది కాలంగా భారత జట్టు నుండి పిలుపు కోసం ఎదురుచేస్తున్నాడు.