Asianet News TeluguAsianet News Telugu

ఇప్పటికే 95% సెట్ అయింది.. అప్పటివరకు అంతా రెడీ.. జట్టు సెలక్షన్‌పై హిట్‌మ్యాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Asia Cup 2022: ఆసియా కప్ -2022లో భారత్ కథ ముగిసింది. ఈ టోర్నీ తర్వాత భారత్ స్వదేశంలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తో  మ్యాచులు ఆడనుంది. ఆ తర్వాత అసలు సమరం ప్రారంభంకానుంది. 

Team Is 90-95% Set For Upcoming T20I World Cup: Rohit Sharma
Author
First Published Sep 7, 2022, 4:43 PM IST

ఆసియా కప్ లో భారత జట్టు ఓడినదానికంటే  గెలిచే  మ్యాచులు ఓడినందుకే టీమిండియా ఫ్యాన్స్ ఎక్కువ బాధపడుతున్నారు. బ్యాటింగ్ లో  ఫర్వాలేదనిపించినా బౌలింగ్ లో మాత్రం మన బౌలర్ల ప్రదర్శన  దారుణంగా ఉంది. అయితే వీటన్నింటికంటే ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేసింది జట్టు ఎంపిక. ఆసియా కప్ లో భారత్ నాలుగు మ్యాచులు ఆడితే  ప్రతీ మ్యాచ్ లోనూ ప్లేయింగ్ లెవన్ (తుది జట్టు) లో మార్పులు జరిగాయి.  ఇప్పుడు చర్చంతా దీనిమీదే నడుస్తున్నది.  రోహిత్-ద్రావిడ్ ల జట్టు ఎంపిక బాగోలేదని క్రికెట్ విశ్లేషకులు, విమర్శకులు పెదవి విరుస్తున్నారు.  

ఈ నేపథ్యంలో  టీమిండియా సారథి రోహిత్ శర్మ మంగళవారం శ్రీలంకతో మ్యాచ్ ముగిశాక  నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాబోయే టీ20 ప్రపంచకప్ లో తుది జట్టు ఎంపికపై తాము కసరత్తులు చేస్తున్నామని.. ఆమేరకు 95 శాతం జట్టు  సిద్ధమైందని అన్నాడు.  రోహిత్ చెప్పిన విషయాలు అతడి మాటల్లోనే... 

‘టీ20 ప్రపంచకప్ కోసం ఇప్పటికే 90-95 శాతం జట్టు రెడీ అయింది. కొన్ని మార్పులు చేర్పులున్నాయి. వాటిని కూడా తొందర్లోనే పూరిస్తాం. ఇక  ప్రయోగాల గురించి మాట్లాడాల్సి వస్తే..  అవును మేము ఇంకా కొన్ని విషయాల్లో క్లారిటీ రాలేకపోతున్నాం. అందుకే ఇంకా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాం.  ఏదైనా ప్రయత్నిస్తేనే కదా దాని ఫలితమేంటో తెలిసేది. అలాగే  మేము కూడా ఈ ఆసియా కప్ లో కొన్ని ప్రయోగాలు చేశాం.   ఆసియా కప్ కు ముందు మేం నలుగురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడాం.  రెండో స్పిన్నర్ ఆల్ రౌండర్ అయ్యేలా చూసుకున్నాం.  

నేను ఏ విషయంలో అయినా ముందు ప్రయత్నం చేసి తద్వారా ఫలితాలను బట్టి ఒక అంచనాకు వస్తాను. అదే ఆసియా కప్ లోనూ చేశాను.  ఇద్దరు స్పెషలిస్టు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లు, ఒక  మీడయం పేసర్ తో ఆడితే ఎలా ఉంటుందని నేను ట్రై చేశాను. మాకు టీ20 ప్రపంచకప్ కు ఇంకా సమయముంది..  ఆలోపు మాకు మరో రెండు సిరీస్ లు ఉన్నాయి.. అక్కడా మాకు ప్రయోగాలు చేయడానికి ఆస్కారముంది..’ అని అన్నాడు. 

వరల్డ్ కప్ కు రెడీ.. 

‘నేను టీ20 ప్రపంచకప్ కు  సిద్ధమవలనుకుంటున్నా. అక్కడ మేం చాలా కఠిన సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది. గడిచిన నాలుగైదు సిరీస్ లలో మాకు కొన్ని సమాధానాలు దొరికాయి. మిగిలిన ప్రశ్నలన్నింటికీ ప్రపంచకప్ లో సమాధానం దొరుకుతుంది.  హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి చేరడంతో మేం ముగ్గురు సీమర్లతో ఆడుతున్నాం.   ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడితే ఏమౌంతుందనేది  ఈ రెండు ఓటముల ద్వారా మాకు తెలిసొచ్చింది.   రానున్న రెండు సిరీస్  తర్వాత  ప్రపంచకప్ లో ఏ కాంబినేషన్ తో ఆడాలనేదానిపై మేం తుది నిర్ణయానికి వస్తాం..’ అని తెలిపాడు.

హుడాకు అందుకే బౌలింగ్ ఇవ్వలేదు.. 

గడిచిన రెండు మ్యాచులలో టీమిండియా దీపక్ హుడాను ఆడించింది. అయితే అతడిని హిట్టర్ గా వాడుకోవాలని చూసింది. బ్యాటింగ్ తో పాటు ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన హుడాకు రెండు మ్యాచులలో అవసరమున్నా రోహిత్ అతడికి బంతినివ్వలేదు. హుడా విషయంలో భారత్ విఫలమైంది. ఈ విషయమై రోహిత్ మాట్లాడుతూ.. ‘అవును, మాకు ఆరో బౌలింగ్ ఆప్షన్ ఉంది. కానీ ఐదుగురు బౌలర్లతో ఆడితే ఏమవుతుంది..? ఏం కాదు..? అని మేం ప్రయత్నించాలనుకున్నాం. లంకతో మ్యాచ్ లో  అప్పటికే ఇద్దరు ఓపెనర్లు (రైట్ హ్యాండర్స్) కుదురుకున్నారు.  ఆ సమయంలో అటాకింగ్ స్పిన్ వేసే చాహల్, అశ్విన్ కు బంతినిస్తే బెటరని అనిపించింది. ఆరో బౌలింగ్ ఆప్షన్ గా నా మనసులో హుడా కూడా ఉన్నాడు. మేం త్వరగా వికెట్లు తీసుంటే నేను కూడా హుడాతో బౌలింగ్ చేద్దామనుకున్నా. కానీ అలా జరగలేదు.. ప్రపంచకప్ లో ఆడేప్పుడు ఇది మాకు ఒక గుణపాఠంగా పనికొస్తుంది...’ అని  వివరించాడు.

దినేశ్ కార్తీక్ ను ఆడించకపోవడంపై.. 

ఆసియా కప్ లో భాగంగా తొలి మ్యాచ్ లో వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ను ఆడించిన భారత్ తర్వాత మ్యాచ్ లలో అతడిని పక్కనబెట్టి రిషభ్ పంత్ ను ఆడించింది. రోహిత్ తీసుకున్న ఈ నిర్ణయంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై రోహిత్ మాట్లాడుతూ.. ‘మేం మిడిలార్డర్ లో  లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ కాంబినేషన్ కావాలనుకున్నాం. అందుకే కార్తీక్ ను పక్కనబెట్టి  పంత్ ను ఆడించాం. అంతేగానీ కార్తీక్ ఫామ్ గురించో మరొకటో కాదు.. కానీ మా  వ్యూహం పలించలేదు..’ అని తెలిపాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios