వెస్టిండిస్ తో ముగిసిన  మూడు వన్డేల సీరిస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఇలా విండీస్ ను వారి స్వదేశంలోనే మట్టికరిపించడంలో  భారత జట్టులోని ఓ ఇద్దరు ఆటగాళ్లే కీలక పాత్ర పోషించారు. వారిలో ఒకరు కెప్టెన్ విరాట్ కోహ్లీ కాగా మరొకరు యువ కెరటం శ్రేయాస్ అయ్యర్. వీరిద్దరే టీమిండియాకు వన్డే సీరిస్ ను సాధించిపెట్టారని అంటే అందులో ఎలాంటి అతిశయోక్తి వుండదు. రెండు, మూడో వన్డేలో ఈ జోడీ ఆటతీరును చూసినవారు ఎవరైనా ఇదే మాట అంటారు. 

ఈ ప్రదర్శనతో శ్రేయాస్ అయ్యర్ పేరు మాగుతోంది. తాను రెండు సెంచరీలతో అదరగొట్టినప్పటికి కోహ్లీ కూడా ఈ సీరిస్ విజయం అయ్యర్ క్రెడిటేనంటూ ప్రశంసించాడు. అతడి సహకారం లేకుంటే తాను సెంచరీలు సాధించడం, టీమిండియా విజయం సాధించడం రెండూ జరిగేవి కావని పేర్కొన్నాడు. తీవ్ర ఒత్తిడి సమయంలోనూ కూల్ గా వుండే అయ్యర్ ను చూసి తన ఒత్తిడి కూడా తగ్గేదని కోహ్లీ పేర్కొన్నాడు. దీంతో అయ్యర్ ఒత్తిడిని అధిగమించి అంత కూల్ గా ఎలా బ్యాటింగ్ చేయగల్గుతున్నాడని అభిమానుల్లో ఓ సందేహం  మొదలయ్యింది. ఇందుకు స్వయంగా అతడే సమాధానం చెప్పాడు. 

మూడో వన్డే అనంతరం అయ్యర్ ను చాహల్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్బంగా అతడు మాట్లాడుతూ...''నేను సాధారణ సమయాల్లో కంటే ఒత్తిడి ఎక్కువగా వుండే సమయాల్లోనే బ్యాటింగ్ కు దిగాలని కోరుకుంటా. అలాంటి సమయంలో ఆడితేనే కదా మన సత్తా బయటపడేది. ఈ ఒత్తిడిని తట్టుకునేందుకు నేను ప్రత్యేకంగా ఏం చేయను. కేవలం టెన్షన్ పడకుండా  వుండేందుకు ప్రయత్నిస్తుంటాను. టెన్షన్ ఎంత పెరిగితే మన ప్రదర్శన అంత తగ్గుతుందని బలంగా నమ్ముతాను. అందువల్లే నా దరిదాపుల్లోకి కూడా టెన్షన్ ను రానివ్వను.

అయితే డ్రెస్సింగ్ రూంలో మిగతా ఆటగాళ్లు ఒత్తిడికి గురవతున్నపుడు వారిని నేనసలు పట్టించచుకోను. అందరూ టెన్షన్ పడుతుంటే నేను మాత్రం ఆ  ఒత్తిడిని ఎంజాయ్  చేయాలనుకుంటా. అలాంటి సమయాల్లో బ్యాటింగ్ చేసే అవకాశం నాకు రెండు, మూడు వన్డేల ద్వారా వచ్చింది. కాబట్టే నాలోని అత్యుత్తమ ఆటగాడు బయటకు వచ్చాడు.'' అని చాహల్ టీవి ద్వారా అయ్యర్ తన విజయరహస్యాన్ని వెల్లడించాడు.     

భారత్-విండీస్ మధ్య జరిగిన మూడు వన్డేలకూ వర్షం అంతరాయం కలిగించింది. దీని వల్ల మొదటి వన్డే పూర్తిగా తుడిచిపెట్టుకుని పోగా రెండు, మూడు వన్డేల్లో డక్ వర్త్ లూయిస్ పద్దతిన ఫలితం తేలింది. అయితే  కోహ్లీ రెండో వన్డే(120 పరుగులు 125  బంతుల్లో),  మూడో వన్డే (114 పరుగులు 99 బంతుల్లో) వరుస సెంచరీలతో, యువకెరటం శ్రేయాస్ అయ్యర్ రెండో వన్డే(71 పరుగులు 68 బంతుల్లో), మూడో వన్డేలో(65 పరుగులు 41 బంతుల్లో)వరుస హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దీంతో భారత జట్టు వెస్టిండిస్ పై పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించి 2-1 తేడాతో విజయాన్ని అందుకుంది.