మొదటి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాను స్వల్ప స్కోరుకే కట్టడి చేశామనే ఆనందం... మొదటి ఇన్నింగ్స్‌లో 53 పరుగుల ఆధిక్యం దక్కిందనే ఉత్సాహం... ఒక్కరోజు కూడా నిలవలేదు. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోరు చేసి, ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్ పెడతారని ఊహించిన అభిమానులు, దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు ఆసీస్ బౌలర్లు.

రెండో రోజు నైట్‌వాచ్‌మెన్‌గా వచ్చిన బుమ్రా వికెట్ తీయడంతో ఆరంభమైన టీమిండియా వికెట్ల పతనం... ఏ దశలోనూ కోలుకోలేదు. 4, 9, 2, 0, 4, 0, 4,0,8...ఇది భారత బ్యాట్స్‌మెన్ సాధించిన పరుగులు... ఒక్కరంటే ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోరును కూడా అందుకోలేకపోయారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

కమ్మిన్స్ బౌలింగ్స్‌లో షమీ గాయపడడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత జట్టు ఆలౌట్ కాకుండా బయటపడగలిగింది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత దారుణమైన రికార్డు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హజల్‌వుడ్ 5 వికెట్లు తీయగా, ప్యాట్ కమ్మిన్స్ 4 వికెట్లు తీశాడు. 36/9 టీమిండియాకు టెస్టుల్లో లోయెస్ట్ స్కోరు కూడా. ఇంతకుముందు 1974లో చేసిన 42 పరుగుల రికార్డు తెరమరుగైంది.