బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్‌లో 120 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న భారత జట్టు... ముచ్ఛటగా మూడోసారి టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకున్న టీమిండియా.. 

మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరినా, ఇంగ్లాండ్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడి తీవ్రంగా నిరాశపరిచింది భారత జట్టు. అయితే అంధుల టీ20 వరల్డ్ కప్ టోర్నీలో మాత్రం డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగిన భారత జట్టు, మరోసారి టైటిల్ కైవసం చేసుకుంది...

తొలిసారి 2012లో టీ20 వరల్డ్ కప్ ఫర్ బ్లైండ్ టోర్నీని నిర్వహించగా, ఆ తర్వాత ఐదేళ్లకు 2017లో, తాజాగా 2022లో ఈ టోర్నీని నిర్వహించారు. మూడు సార్లు కూడా టీమిండియానే టైటిల్‌ గెలవడం విశేషం. సెమీ ఫైనల్‌లో సౌతాఫ్రికాని 207 పరుగుల భారీ తేడాతో ఓడించి ఫైనల్ చేరిన భారత జట్టు... బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన అంధుల టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ జట్టును 120 పరుగుల తేడాతో ఓడించి ఘన విజయం అందుకుంది...

తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. డీ వెంకటేశ్వర రావు 10 పరుగులు చేసి అవుట్ కాగా లలిత్ మీరా డకౌట్ అయ్యాడు. 29 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఈ దశలో సునీల్ రమేశ్, కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి కలిసి మూడో వికెట్‌కి రికార్డు స్థాయిలో 248 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు...

Scroll to load tweet…

సునీల్ రమేశ్ 63 బంతుల్లో 24 ఫోర్లు, ఓ సిక్సర్‌‌తో 136 పరుగులు చేయగా కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి 50 బంతుల్లో 18 ఫోర్లతో 100 పరుగులు చేశాడు. ఎక్స్‌ట్రాల రూపంలో టీమిండియాకి 31 పరుగులు అదనంగా లభించాయి. 278 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన బంగ్లాదేశ్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది...

మహ్మద్ అసికర్ రహ్మన్ 21 పరుగులు చేయగా అబిడ్ 18 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. అరిఫ్ ఉల్లా 22 పరుగులు చేయగా సల్మాన్ 66 బంతుల్లో 5 ఫోర్లతో 77 పరుగులు చేశాడు. చేయాల్సిన రన్‌రేట్ అంతకంతకీ పెరిగి పోవడంతో చేతిలో వికెట్లు ఉన్నా పరుగులు రాబట్టలేకపోయారు బంగ్లా బ్యాటర్లు..