భారత మహిళా జట్టు సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. మొత్తం 88 టీ20 మ్యాచ్‌లు ఆడిన మిథాలీ.. 2,364 పరుగులు చేసింది. కెప్టెన్‌గా 32 టీ20 మ్యాచ్‌లకు నాయకత్వం వహించింది. 2012, 2014, 2016 టీ20 వరల్డ్‌కప్‌లకు సైతం ఆమె కెప్టెన్‌గా చేశారు.

ఈ ఏడాది మార్చిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్ మిథాలీకి చివరిది. ఆ మ్యాచ్‌లో మిథాలీరాజ్ 32 బంతుల్లో 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఇందులో 17 అర్థ సెంచరీలున్నాయి. అత్యుత్తమ స్కోరు 97 పరుగులు.

రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆమె మాట్లాడుతూ.. 2006 నుంచి భారత్ తరపున టీ20లు ఆడుతున్నానని.. అయితే ఈ ఫార్మాట్‌లో పనిభారం ఎక్కువగా ఉండటంతో తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

2021 వన్డే వరల్డ్‌కప్‌కు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావడంపైనే తాను దృష్టి సారించానని.. భారత్‌కు ప్రపంచకప్‌ను అందించడమే తన కల అని.. ఇందు కోసం శక్తిమేరకు కష్టపడతానని మిథాలీ తెలిపారు.

కాగా... వారం క్రితం దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉంటానని ప్రకటించిన.. ఆమె ఇంతలోనే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏంటో అర్ధం కావడం లేదు.