టీమిండియా వైస్ కెప్టెన్, ఓపనర్ రోహిత్ శర్మ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను విజయ తీరాలకు చేర్చి నాలుగో సారి జట్టును విజేతగా నిలిపాడు. ఆ విజయంతో ఇప్పుడు ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన రోహిత్ శర్మ ఇక్కడా సత్తా చాటాలని భావిస్తున్నాడు.

ఈ క్రమంలో జట్టు సభ్యుల గురించి ఐసీసీ ప్రతినిధి అడిగిన కొన్ని ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పాడు. టీమిండియాలో అత్యంత చెత్త డ్యాన్సర్ ఎవరంటే హార్డిక్ పాండ్యా పేరు చెప్పాడు. అంతేకాకుండా శిఖర్ ధావన్‌ను ‘‘వరస్ట్ రూమ్‌మేట్’’ అని అన్నాడు.

ధావన్ శుభ్రంగా ఉండడని.. అందుకే అతనితో ఉండాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుందని పేర్కొన్నాడు. అలాగే జట్టులో ఏ ఆటగాడు తన గురించి తానే ఎక్కువగా గూగుల్‌లో వెతుకుతాడు అని ప్రశ్నించగా అందుకు మరోసారి పాండ్యా పేరే చెప్పాడు రోహిత్.

అలాగే జట్టు బ్యాటింగ్ కోచ్ సంజయ్ భంగర్ బస్సు ఎక్కేందుకు చాలా ఆలస్యంగా వస్తారని రోహిత్ వ్యాఖ్యానించాడు. మరో వైపు ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత్ దారుణంగా ఓడిపోవడంతో.... మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో విజయం సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది.