వీరేంద్ర సెహ్వాగ్... ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది విద్వంసకర క్రికెట్. ఓపెనర్ అంటే క్రీజులో  నిలదొక్కుకుని నెమ్మదిగా పరుగులు చేయాలన్న సాంప్రదాయానికి తెరదించిన ఆటగాడు. ఇలా తన ధనాదన్ బ్యాటింగ్ ద్వారా భారత జట్టుకు ఎన్నో విజయాలను కట్టబెట్టిన అతడి పేరు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. కొద్దిరోజుల క్రితం టీమిండియా చీఫ్ కోచ్ రేసులో అతడి పేరు బలంగా వినిపించింది. తాజాగా  దాన్ని కాదని భారత ఆటగాళ్లను ఎంపికచేసే సెలెక్షన్ కమిటీలో చోటు కల్పించాలంటూ అతడే బహిరంగంగా కొరడం చర్చనీయాంశంగా మారింది.  

భారత ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశాన్ని తనకు కల్పించాలంటూ సెహ్వాగ్ కోరుకుంటున్నాడు. టీమిండియా సెలెక్టర్ గా పనిచేయాలని వుందంటూ తన మనసులో మాటను అతడు ట్విట్టర్ ద్వారా బయటపెట్టాడు. '' నేను సెలెక్టర్ కావాలనుకుంటున్నా.... ఎవరు నాకు అవకాశమిస్తారు..?'' అంటూ సెహ్వాగ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. 

అయితే సెహ్వాగ్ చేసిన ఈ ట్వీట్ వెనక వున్న అంతరార్థం ఏమిటో ఎవ్వరికీ అర్థం కావడంలేదు. నిజంగానే సెలెక్టర్ గా మారి తనకు మంచి అవకాశాలిచ్చిన భారత జట్టుకు సేవ చేయాలనుకుంటున్నట్లున్నాడు అని కొందరు అభిమానులు  అర్థం చేసుకున్నారు. మరికొందరు ప్రస్తుతమున్న ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీపై సెహ్వాగ్ సెటైర్లు వేస్తూ ఈ ట్వీట్ చేశాడని  అర్థం  చేసుకున్నట్లు కామెంట్ చేస్తున్నారు. ''మీకు అంతర్జాతీయ క్రికెట్లో చాలా మంచి రికార్డుంది. అందువల్ల సెలెక్టర్ గా పనికిరారు. క్రికెటర్ గా చెత్త రికార్డుంటేనే భారత జట్టు సెలెక్టర్ గా మారవచ్చు.'' అంటూ కొందరు నెటిజన్లు సెహ్వాగ్ ట్వీట్ పై కాస్త ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. 

టెస్ట్, వన్డే, టీ20 ఇలా మూడు ఫార్మాట్స్ లోనూ సెహ్వాగ్ ఓపెనర్ గా  బరిలోకి దిగేవాడు. టెస్టుల్లో  భారత దిగ్గజాలెవరికీ సాధ్యంకాని ట్రిపుల్ సెంచరీని అలవోకగా సాధించి రికార్డు సృష్టించాడు. అదికూడా ఒక్కసారి కాదు ఏకంగా రెండుసార్లు.  ఇలా 104 టెస్టులాడిన  అతడు 8,586 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో  251 మ్యాచ్‌లు ఆడి 8,273 పరుగులు సాధించాడు. ఈ పార్మాట్ లో డబుల్ సెంచరీ బాదిన అతి తక్కువ మంది క్రికెటర్లలో అతడొకడు. తన కెరీర్ చివరి  దశలో అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించిన టీ20 పార్మాట్  లో సెహ్వాగ్ 19 మ్యాచులు మాత్రమే ఆడాడు. అందులో 394 పరుగులు బాదాడు.