టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రస్తుతం భారత జట్టులో చోటుచేసుకుంటున్న సంఘటనలపై ఘాటుగా స్పందించాడు. మరీముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ పెత్తనాన్ని ఆయన పరోక్షంగా ప్రశ్నించాడు. భారత క్రికెట్ జట్టులో కోహ్లీ ఏకచత్రాధిపత్యం కొనసాగుతోందని...సెలెక్టర్లు సైతం అతడికి ఎదురుచెప్పే సాహసం చేయలేకపోతున్నారని గవాస్కర్ మండిపడ్డాడు. సెలక్షన్ కమిటీ వ్యవహారశైలి ఇలాగే వుంటే పరిస్థితులు మరింత దారుణంగా  తయారవుతాయని హెచ్చరించాడు. కాబట్టి ఇప్పటికైనా సెలెక్టర్లు తమ అధికారాలను ఉపయోగించుకుంటూ నిస్పక్షపాతంగా వ్యవహరించాలని గవాస్కర్ సూచించాడు. 

 ''వెస్టిండిస్ పర్యటన కోసం భారత జట్టును ఎంపిక చేసే క్రమంలో సెలెక్టర్లు మరీ దారుణంగా వ్యవహరించారు. ప్రపంచ కప్ ఓటమి తర్వాత చేపడుతున్న ఈ పర్యటనకు కొద్దిరోజుల ముందువరకు కోహ్లీకి విశ్రాంతినివ్వనున్నట్లు వాళ్లే తెలిపారు. ఆ తర్వాత హటాత్తుగా ఏమయిందో ఏమోగానీ కోహ్లీని ఈ పర్యటన కోసం ఎంపికచేశారు. ఈ పరిణాలను పరిశీలిస్తే సెలెక్టర్ల కంటే కోహ్లీనే పవర్ ఫుల్ అనే విషయం అర్థమవుతోంది. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని ఈ కమిటీ ఓ కుంటి బాతుసెలెక్షన్ కమిటీ.

కోహ్లీ కేవలం ప్రపంచ కప్ వరకే టీమిండియా కెప్టెన్. ఆ తర్వాత అతన్ని కెప్టెన్ గా కొనసాగించాలంటే దానికోసం ప్రత్యేకంగా సమావేశం జరగాల్సి వుంటుంది. అలా సెలెక్టర్లతో పాటు బిసిసిఐ అతడి వల్ల జట్టుకు భవిష్యత్ లో మంచి ప్రయోజనాలు చేకూతాయని భావిస్తే కొనసాగించవచ్చు. లేదంటే వేరే కెప్టెన్ ను సైతం ఎంపిక చేయవచ్చు. అలా కాకుండా ఆఘమేఘాల మీద విండీస్ పర్యటనలో అన్ని ఫార్మాట్లకు మళ్లీ కోహ్లీని కెప్టెన్ గా ఎంపిక చేయడం సెలెక్టర్ అసమర్ధతను సూచిస్తోంది.'' అంటూ కోహ్లీ ఆధిపత్యాన్ని పరోక్షంగా ప్రశ్నిస్తూనే గవాస్కర్ సెలెక్టర్ల పై విరుచుకుపడ్డాడు.