ప్రపంచ కప్ మెగా టోర్నీ ఫైనల్లో నాటకీయ పరిణామాల మధ్య ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. మ్యాచ్ తో  పాటు సూపర్  ఓవర్  కూడా టై అయిన సమయంలో విజేతలను ఎలా నిర్ణయిస్తారని అభిమానుల్లో ఓ ప్రశ్న ఉత్పన్నమైంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు సూపర్ ఓవర్ కంటే మరింత కఠిన పరీక్షను ఎదుర్కొనే అవకాశాలుండవచ్చని భావించారు. కానీ ఎవ్వరూ ఊహించని  విధంగా మ్యాచ్ మొత్తంలో బాదిన బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్ ను విజేతగా ప్రకటించడం అభిమానులకే కాదు క్రికెట్ పండితులు చివరకు మాజీ క్రికెటర్లకు కూడా నచ్చలేదు. ఈ నిబంధన క్రీడాస్పూర్తిని  దెబ్బతీసేలా వుందన్న విమర్శలపై ఐసిసి స్పందించింది. 

ఈ బౌండరీల నిబంధనపై సమీక్షించేందుకు ఐసిసి ఓ కమిటీని ఏర్పాటుచేసింది. భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఈ కమిటీ పనిచేయనుందని ఐసీసీ జనరల్‌ మేనేజర్‌ జియోఫ్‌ అలార్డెస్‌ వెల్లడించాడు. సూపర్ ఓవర్ టై అయినపుడు విజేతలను నిర్ణయించడానికి ఐసిసి ఉపయోగిస్తున్న ఈ బౌండరీ నిబంధన ఎంతవరకు సమంజసమో ఈ కమిటీ తేల్చనుందని ఆయన తెలిపారు. ఒకవేళ ఇంతకంటే మంచి ప్రత్యామ్నాయాలు ఏమైనా వుంటే గుర్తించి తమకు తెలియజేసే బాధ్యతను కూడా ఈ కమిటీకే అప్పగించినట్లు జియోఫ్‌ వెల్లడించాడు.

వన్డే, టీ20 మ్యాచ్ లు టైగా ముగిస్తే సూపర్ ఓవర్ నిర్వహించి విజేతలను నిర్ణయించే నిబంధనను ఐసిసి 2009 లో రూపొందించింది. అదే సమయంలో ఈ సూపర్ ఓవర్ కూడా టై అయితే మ్యాచ్ లో ఎక్కువ బౌండరీలు బాదిన జట్టునే విజేతలుగా ప్రకటించాలన్న నిబంధన కూడా అప్పుడు ప్రవేశపెట్టిందే. కానీ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల్లో మత్రం ఈ రూల్ ఆధారంగా విజేతలను ప్రకటించాల్సిన అవసరం రాలేదు. కానీ ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ద్వారా ఇలాంటి నిబంధన ఒకటుందని ప్రపంచానికి తెలిసింది. దీంతో ఇలాంటి సిల్లీ రూల్స్ క్రికెట్లో క్రీడాస్పూర్తిని దెబ్బతీస్తున్నాయన్న అభిమానుల విమర్శల నేపథ్యంలో ఐసిసి కమిటీని ఏర్పాటుచేసింది.