భారత అండర్ 19 జట్టులో కరోనా వ్యాక్సిన్ వేసుకోని ఏడుగురు ప్లేయర్లను అడ్డుకున్న ఎయిర్‌పోర్ట్ అధికారులు... తిరిగి వెనక్కి వెళ్లిపోవాలంటూ హెచ్చరిక...
ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ 2022 టోర్నీని గెలిచి, సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది భారత యువ జట్టు. యశ్ ధుల్ కెప్టెన్సీలో అండర్ 19 ఆసియా కప్ గెలిచిన జోష్‌లో కరేబియన్ గడ్డపై అడుగుపెట్టి... రికార్డు స్థాయిలో ఐదో సారి వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించింది భారత అండర్ 19 జట్టు...
అయితే అండర్ 19 వరల్డ్ కప్ 2022 టోర్నీ కోసం వెస్టిండీస్‌లో అడుగుపెట్టిన భారత బృందానికి అక్కడ అవమానకర సంఘటన ఎదురైందట. కరోనా వ్యాక్సిన్ కోర్సు పూర్తి చేసుకోనందుకు భారత అండర్ 19 బృందంలోని ఏడుగురు క్రికెటర్లను వెనక్కి తిరిగి వెళ్లిపోవాలని సూచించడమే కాకుండా 24 గంటలకు పైగా ఎయిర్ పోర్టులోనే నిలిపివేశాడట అక్కడ అధికారులు..
పంజాబ్‌లోని అమృత్ సర్ నుంచి దుబాయ్ చేరుకుని, అక్కడి నుంచి పోర్ట్ ఆఫ్ స్పెయిన్ చేరుకుంది భారత జట్టు. అయితే కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేని కారణంగా భారత బృందంలోని ఏడుగురు ప్లేయర్లను ఎయిర్‌పోర్టుని అడ్డుకున్న ఇమిగ్రేషన్ అధికారులు, ప్రభుత్వ అనుమతి వచ్చేవరకూ వారిని వదిలేది లేదని తేల్చి చెప్పేశారట...
భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన లెఫ్ట్ హ్యాండ్ పేసర్ రవి కుమార్‌తో పాటు ఓపెనర్ అంగ్‌క్రిష్ రఘువంశీలను ‘వెనక్కి తిరిగి వెళ్లిపోవాలంటూ’ సూచించారట. భారత జట్టు టీమ్ మేనేజర్ లోబ్జాంగ్ జీ టెంజింగ్, ఐసీసీతో పాటు బీసీసీఐ అధికారులతో వెంటనే సంప్రదించి... భారత జట్టును ఈ ఆపద నుంచి రక్షించాడట...
‘మేం పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో దిగిన తర్వాత గుయానాకి ఛార్టెడ్ ఫ్లైయిట్ ఎక్కాల్సి ఉంది. అయితే అక్కడ మా టీమ్‌లో ఏడుగురు ప్లేయర్లను ఆపేశారు. వ్యాక్సిన్ వేసుకోలేదని చెప్పి, వెనక్కి వెళ్లిపోవాలంటూ సూచించారు...
ఇండియాలో టీనేజ్ కుర్రాళ్లకి ఇంకా వ్యాక్సిన్సేషన్ వేయడం ప్రారంభించలేదని ఇమిగ్రేషన్ అధికారులకు వివరించేందుకు ప్రయత్నించాం. అయితే వాళ్లు మాత్రం తర్వాతి ఫ్లైయిట్‌లో ఇండియాకి తిరిగి పంపిస్తామంటూ బెదిరించారు...
ఎయిర్‌లైన్స్ సెక్యూరిటీ ఆఫీసర్లు, మమ్మల్ని చుట్టుముట్టారు. మేం అక్కడి నుంచి పారిపోతామోనని అనుమానంతో దొంగల్లా చూశారు. ఇమిగ్రేషన్ అధికారులతో, ఎయిర్ లైన్స్‌తో వాదోపవాదనలు జరిగేలోపు మేం ఎక్కాల్సిన ఫ్లైయిట్ కాస్త వెళ్లిపోయింది. తర్వాతి ఫ్లైయిట్ మూడు రోజుల తర్వాత కానీ లేదని చెప్పారు. నేను, బాయ్స్‌తో పాటు ఉండడానికి నిర్ణయించుకున్నాను...
ఎయిర్‌పోర్ట్ పక్కన ఓ హోటెల్‌లో ఆ రాత్రి గడిపాం. ఆ తర్వాత ఐసీసీ అధికారులతో, అక్కడి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి విషయం వివరించాను. ఎట్టకేలకు 24 గంటల తర్వాత మా సమస్యను పరిష్కరించారు. ఆ రాత్రి మేమంతా ఓ భయానక పరిస్థితులను ఎదుర్కొన్నాం...’ అంటూ చెప్పుకొచ్చాడు అండర్ 19 భారత టీమ్ మేనేజర్ లోబ్జాంగ్ జీ టెంజింగ్...
అండర్ 19 వరల్డ్ కప్ కోసం వెస్టిండీస్‌కి చేరిన భారత జట్టు, రెండు మ్యాచుల తర్వాత కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. భారత జట్టులోని ఐదుగురు కీలక ప్లేయర్లతో పాటు అడ్మినిస్టేషన్ సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారు...
అండర్ 19 టీమిండియా కెప్టెన్ యశ్ ధుల్‌తో పాటు వైస్ కెప్టెన్ షేక్ రషీద్, ఆరాధ్య యాదవ్ వంటి ప్లేయర్లు కరోనా బారిన పడినప్పటికీ మిగిలిన జట్టు ప్లేయర్లు అద్భుత విజయాలతో భారత జట్టును క్వార్టర్ ఫైనల్స్‌కి చేర్చారు. క్వార్టర్ ఫైనల్స్ సమయానికి భారత ప్లేయర్లు, కరోనా నుంచి కోలుకుని జట్టుకి అందుబాటులోకి వచ్చి, ఏకంగా అండర్ 19 వరల్డ్ కప్ గెలిచి అదరగొట్టారు...
