Asianet News TeluguAsianet News Telugu

రవిశాస్త్రికి ఊహించని కానుకలిచ్చిన టీమిండియా పాత, కొత్త టీ20 కెప్టెన్లు.. సంతోషంగా పొంగిపోయిన మాజీ కోచ్

Virat kohli And Rohit sharma: సుమారు ఐదేండ్లపాటు భారత క్రికెట్ కు ప్రధాన శిక్షకుడిగా సేవలందించిన రవిశాస్త్రికి టీమిండియా ఘనంగా వీడ్కోలు పలికింది. భారత టీ20 జట్టుకు పాత, కొత్త కెప్టెన్లైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు..  ఆయనకు అపురూపమైన కానుక అందజేశారు.

Team India T20 New Skipper Rohit Sharma and Virat kohli gift Their Bats to Ravi shastri
Author
Hyderabad, First Published Nov 9, 2021, 6:35 PM IST

భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా పదవీకాలం పూర్తి చేసుకున్న రవిశాస్త్రికి టీమిండియా తాజా, మాజీ సారథులు అపురూపమైన కానుకలిచ్చారు.  భారత జట్టుకు  ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన విరాట్ కోహ్లి-రవి శాస్త్రిలకు నిన్నటి రోజు చాలా ప్రత్యేకం. అయితే విరాట్ కేవలం సారథ్య బాధ్యతల నుంచే తప్పుకున్నా ఇంకా జట్టుతో ఆడుతాడు. కానీ రవిశాస్త్రి మాత్రం ఇకపై డ్రెస్సింగ్ రూమ్ లో కనిపించడు.  దీంతో ఆదివారం రాత్రంతా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ గంభీరంగా మారింది. ఆటగాళ్లు, కోచ్ లు తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇదే క్రమంలో పొట్టి ఫార్మాట్ లో భారత్ కు  సారథ్యం వహించిన మాజీ సారథి కోహ్లి.. తాజా కెప్టెన్ రోహిత్ శర్మ (న్యూజిలాండ్ తో  టీ20 సిరీస్ కోసం హిట్ మ్యాన్ ను సారథిగా ఎంపికచేశారు) లు.. వారి ఇష్టమైన  బ్యాట్లను శాస్త్రికి కానుకగా ఇచ్చారు. 

మాములుగా అత్యంత ఆత్మీయులకు తప్పితే క్రికెటర్లు ఎవరికి పడితే వాళ్లకు తమ బ్యాట్లను ఇవ్వరు. క్రికెట్ ఆడుతున్నప్పుడు పరుగులు చేయడానికే కాదు.. కొన్నిసార్లు వాళ్ల ప్రాణాలు కాపాడటంలో కూడా బ్యాట్లది ప్రధాన పాత్రే.  ఒకరకంగా బ్యాట్లు వాళ్ల ఆయుధాలు.  అంతటి ప్రాముఖ్యత కలిగిన బ్యాట్లను విరాట్ కోహ్లి.. రోహిత్ శర్మలు తమ మాజీ  శిక్షకుడికి అందించారు. 

నమీబియా తో మ్యాచ్ ముగిసిన అనంతరం.. ఈ ఇద్దరూ కలిసి తాము సంతకం చేసిన  బ్యాట్లను రవికి అందించారు. వాటిని చూస్తూ అతడు మురిసిపోయాడు. ఆ తర్వాత వాటిని పట్టుకుని తన కోచింగ్ స్టాఫ్ తో ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఇప్పుడు ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. 

 

భారత జట్టులో గంగూలీ-జాన్ రైట్, ధోని-కిర్స్టెన్ తర్వాత విరాట్ కోహ్లి-రవిశాస్త్రి ల ద్వయం అంతటి పేరు గడించింది. టీమిండియాను  మూడు ఫార్మాట్లలో అగ్రస్థాయి జట్టుగా నిలబెట్టింది. వీరి హయాంలో భారత జట్టు టెస్టులలో ఏకంగా 42 నెలలపాటు నెంబర్ వన్ గా ఉండటం గమనార్హం. అంతేగాక ఆస్ట్రేలియా లో ఆ జట్టును ఓడించింది. ఇటీవలే ముగిసిన ఇంగ్లాండ్ సిరీస్ లోనూ అదరగొట్టింది. మొత్తంగా చూస్తే ఈ ద్వయం.. భారత్ కు స్వదేశంలోనే  కాదు విదేశాల్లో కూడా విజయాలను అలవాటుగా చేసుకోవడమెలాగో చేసి చూపించింది. విరాట్ కోహ్లి-రవిశాస్త్రి లు తమ హయాంలో టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. విరాట్ సారథిగా.. శాస్త్రి శిక్షకుడిగా భారత్.. 39 టెస్టులు, 67 వన్డేలు, 47 టీ20 లు ఆడింది. మూడు ఫార్మాట్లలో.. 56.41 శాతం (టెస్టులు), 67.42 శాతం (వన్డేలు), 66.67 శాతం (టీ20లు) చిరస్మరణీయ విజయాలు అందించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios