టీమిండియా యువ బౌలర్, యార్కర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా ఇంటికి రెండు రోజుల ముందుగానే రాఖీ పండగ వచ్చింది. వెస్టిండిస్ తో జరుగుతున్న టీ20, వన్డే సీరిస్ కు దూరమైన అతడు ప్రస్తుతం ఇండియాలోనే వున్నాడు. అయితే టెస్ట్ సీరిస్ కు ఎంపికైన నేపథ్యంలో ఇప్పటికే కరీబియన్ దీవులకు పయనమయ్యాడు. ఈ నేపథ్యంలోనే తన  సోదరితో కలిసి రాఖీ పండగను ముందుగానే జరుపుకున్నాడు. 

తన సోదరితో రాఖీ కట్టించుకుంటున్న ఫోటోలను బుమ్రా తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశాడు. '' భారత క్రికెట్ ప్లేయర్ గా జట్టుకు సేవలు అందించే క్రమంలో  రక్షా బంధన్ రోజున నేను ఇక్కడ(ఇండియాలో) వుండటంలేదు. అయితే ఈ పండగను, సోదరి ప్రేమను ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావొద్దనుకున్నాను. ముఖ్యంగా ప్రతిసారి నా వెన్నంటి  వుండి ప్రేమను పంచే నిన్ను ఈ పండగపూట మిస్ అవుతున్నాను. అందువల్లే ముందుగానే రాఖీ పండగను జరుపుకున్నాను.'' అంటూ బుమ్రా తన సోదరి జుహికాతో కలిసి పండగను సెలబ్రేట్ చేసుకున్న పోటోలను పోస్ట్ చేశాడు. 

ఈ నెల 22 నుండి ప్రారంభమయ్యే రెండు టెస్టుల సీరిస్ కోసం బుమ్రా వెస్టిండిస్ కు పయనమయ్యాడు. ఇవాళ్టితో(బుధవారం) వన్డే సీరిస్ ముగియనున్న నేపథ్యంలో ఇక టీమిండియా గురువారం నుండి  టెస్ట్ సీరిస్ కోసం సన్నద్దమవనుంది. ఇందుకోసం  17 నుండి 19 వ తేదీ వరకు ఇరు జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడనున్నాయి.     అందుకోసమే బుమ్రా ముందస్తుగానే విండీస్ కు పయనమయ్యాడు. దీంతో గురువారం  జరగనున్న రాఖీ పండగను మిస్సవకుండా  వుండేందుకు రెండు రోజుల ముందుగానే పండగను జరుపుకున్నాడు. 

ప్రపంచ  కప్ తో పాటు అంతకు ముందు కూడా బుమ్రా అసలు విరామం లేకుండా బిజీబిజీగా గడిపాడు. టీమిండియా కీలక బౌలర్ గా వున్న అతడిని ప్రతిష్టాత్మక ఐసిసి ఈవెంట్ ప్రపంచ కప్ కు ముందు జరిగిన ఐపిఎల్ లో ఆడించవద్దనే వాదన వినిపించింది. అయితే అలా జరగలేదు సరికదా ఐపిఎల్ లో చివరి మ్యాచ్ వరకు అతడు ఆడాల్సి వచ్చింది. ఆ వెంటనే మొదలైన ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనాల్సి వచ్చింది. దీంతో వెస్టిండిస్ తో జరిగిన టీ20, వన్డే సీరిస్ ల నుండి అతడికి విశ్రాంతినిచ్చారు.