ICC Test Rankings-Virat Kohli: గత కొద్దికాలంగా బీసీసీఐ తో అభిప్రాయబేధాలు, వన్డే కెప్టెన్సీ వివాదం తదితర అంశాలతో రోజు వార్తల్లో వ్యక్తిగా ఉంటున్న భారత టెస్టు సారథి విరాట్ కోహ్లికి మరో షాక్ తగిలింది. 

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో శతకంతో మెరవడమే గాక గత కొద్దికాలంగా నిలకడగా రాణిస్తున్న Team India ఓపెనర్, వాండరర్స్ టెస్టులో భారత తాత్కాలిక సారథి KL Rahul ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. తాజాగా విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) Test Rankings లో అతడు తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకున్నాడు. ఈ వారపు ర్యాంకింగ్స్ లో రాహుల్ ఏకంగా 18 స్థానాలు ఎగబాకాడు. 18 స్థానాలు మెరుగుపర్చుకున్న రాహుల్.. 31 వ స్థానానికి చేరాడు. అతడితో పాటు మరో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా ఓ స్థానాన్ని మెరుగుపర్చుకుని 11 వ ప్లేస్ కు చేరాడు. 

కాగా మరోవైపు భారత టెస్టు సారథి Virat Kohli మాత్రం టెస్టు ర్యాంకింగ్స్ లో మరింత దిగజారాడు. రెండేండ్లుగా సెంచరీ చేయలేక తంటాలు పడుతున్న కోహ్లి.. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో కూడా విఫలమయ్యాడు. తాజా ర్యాంకింగ్స్ లో అతడు గతం కంటే మరో రెండు స్థానాలు దిగజారి 9వ స్థానానికి పడిపోయాడు.

Scroll to load tweet…

కొత్త ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగులలో ఆస్ట్రేలియన్ బ్యాటర్ లబూషేన్ మరోసారి తొలి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న యాషెస్ సిరీస్ లో భాగంగా అతడు రెండో టెస్టులో సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 915 పాయింట్లతో అతడు అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లాండ్ సారథి జో రూట్ రెండో స్థానంలో ఉన్నాడు. టీమిండియా నుంచి రోహిత్ శర్మ 5 వ స్థానాన్ని నిలుపుకున్నాడు. గతనెలలో 7 ర్యాంకులో ఉన్న కోహ్లి ఇప్పుడు రెండు స్థానాలు కిందికి దిగజారడం గమనార్హం. 

న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్స‌న్ మూడో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా బ్యాట‌ర్ స్టీవ్ స్మిత్ నాలుగో స్థానానికి ఎగ‌బాకాడు. ఆరో స్థానంలో ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ కొన‌సాగుతున్నాడు. నిన్నటి దాకా కోహ్లి కంటే తక్కువ ర్యాంకులో ఉన్న శ్రీలంక ఆటగాడు కరుణరత్నే (7 వ ర్యాంకు), పాక్ సారథి బాబర్ ఆజమ్ (8వ ర్యాంకు) లో ఉన్నారు. కోహ్లి తర్వాత ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్ పదో స్థానంలో ఉన్నాడు. దీంతో బ్యాటింగ్ ర్యాంకుల టాప్-10 జాబితాలో నలుగురు ఆసీస్ బ్యాటర్లే ఉండటం విశేషం. 

Scroll to load tweet…

ఇక బౌలింగ్ లో భారత ఆఫ్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. 902 పాయింట్లతో ఆసీస్ సారథి పాట్ కమిన్స్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మూడో స్థానంలో పాక్ యువ పేసర్ షాహీన్ షా అఫ్రిది ఉండగా.. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడు స్థానాలు ఎగబాకి టాప్-10 లోకి వచ్చాడు. ప్రస్తుతం అతడు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. టెస్టు ఆల్ రౌండర్ల జాబితాలో కూడా అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వెస్టిండీస్ కు చెందిన జేసన్ హోల్డర్ అగ్రస్థానంలో ఉన్నాడు.