Asianet News TeluguAsianet News Telugu

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కి జట్టును ప్రకటించిన బీసీసీఐ... రోహిత్, రాహుల్‌పై ఆగని ట్రోలింగ్...

డిసెంబర్ 9 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత మహిళా క్రికెట్ టీమ్... గాయం కారణంగా పూజా వస్త్రాకర్ దూరం! స్నేహ్ రాణాకి దక్కని చోటు.. 

Team India Squad announced for Australia tour, Rohit Sharma, Kl Rahul gets trolls
Author
First Published Dec 2, 2022, 1:39 PM IST

ఆసియా కప్ 2022 టైటిల్ గెలిచిన భారత మహిళా క్రికెట్ టీమ్, కొన్ని రోజులుగా ఖాళీగా ఉంది. దాదాపు నెలన్నర బ్రేక్ తర్వాత తిరిగి బరిలో దిగబోతోంది టీమిండియా. డిసెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా టూర్‌కి భారత మహిళల జట్టును ప్రకటించింది బీసీసీఐ. 

ఈ టూర్‌కి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అందుబాటులో ఉండబోతున్నారు. అలాగే వీరితో పాటు యంగ్ సెన్సేషనల్ ఓపెనర్ షెఫాలీ వర్మ, వికెట్ కీపర్ యషికా భాటియా, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘనా సింగ్, అంజలి సర్వాణీ, దేవికా వైద్య, ఎస్ మేఘన, రిచా ఘోష్, హర్లీన్ డియోల్‌లకు చోటు దక్కింది...

మోనికా పటేల్, అరుంధతి రెడ్డి, ఎస్‌బీ పోకర్కర్, సిమ్రాన్ బహదూర్ నెట్ బౌలర్లుగా ఎంపికయ్యారు. భారత ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ గాయం కారణంగా ఈ సిరీస్‌కి దూరమైనట్టు బీసీసీఐ ప్రకటించింది. అయితే భారత యంగ్ ఆల్‌రౌండర్ స్నేహ్ రాణాకి ఈ సిరీస్‌లో చోటు కల్పించలేదు సెలక్టర్లు...

అయితే భారత మహిళా జట్టును ప్రకటిస్తూ బీసీసీఐ పోస్టు చేసిన ట్వీట్‌ని కూడా ట్రోల్ చేసేందుకు వాడుకుంటున్నారు టీమిండియా ఫ్యాన్స్. ఈ టీమ్‌కి రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లను ఎంపిక చేయాలని, అప్పుడైనా వాళ్లు పరుగులు చేస్తారేమోననంటూ వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మరికొందరేమో కనీసం ఈ జట్టులో అయినా సంజూ శాంసన్‌కి చోటు ఇవ్వాల్సిందంటూ వెటకారంగా కామెంట్లు చేస్తున్నారు...

సాధారణంగా భారత క్రికెట్ బోర్డు మహిళా సోషల్ మీడియా అకౌంట్‌లో చేసే పోస్టులకు అస్సలు రీచ్ ఉండదు. జనాలు పెద్దగా పట్టించుకోరు. అలాంటి ఆస్ట్రేలియా టూర్‌కి జట్టును ప్రకటించిన ట్వీట్‌కి వేలల్లో లైకులు, వందల్లో కామెంట్లు రావడం చూసి నిజమైన క్రికెట్ ఫ్యాన్స్ షాక్‌కి గురవుతున్నారు... భారత మహిళా క్రికెట్ టీమ్‌ని పట్టించుకోకపోయినా పర్లేదు కానీ ఇలా పురుష క్రికెటర్లను ట్రోల్ చేసేందుకు వుమెన్స్ టీమ్‌ని వాడుకోవడం సరిగా లేదని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు..

నెట్ రన్ రేట్ కారణంగా వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీలో సెమీస్ చేరలేకపోయిన భారత జట్టు, కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం గెలిచింది. ఆ తర్వాత ఆసియా కప్ 2022 టోర్నీ ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి టైటిల్ కూడా సాధించింది. 

డిసెంబర్ 9న ఇండియా - ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత డిసెంబర్ 11న రెండో టీ20, 14న మూడో టీ20, 17న నాలుగో టీ20 మ్యాచులు జరుగుతాయి. డిసెంబర్ 20న ఆఖరి టీ20 ఆడే టీమిండియా, తిరిగి స్వదేశానికి తిరిగి రానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios