టీమిండియా యువ సంచలనం, యార్కర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా ఇటీవల ఓ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్లో దిగ్గజ బౌలర్లకు కూడా సాధ్యంకానీ ఓ అద్భుత రికార్డును అతడు నెలకొల్పాడు. వెస్టిండిస్ తో జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య వెస్టిండిస్‌పై చెలరేగి హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. అయితే బుమ్రా హ్యాట్రిక్ హర్భజన్ సింగ్, గిల్ క్రిస్ట్ ల మధ్య వివాదాన్ని రాజేసింది. 

గతంలో భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో కేవలం ఇద్దరు బౌలర్లు మాత్రమే హ్యాట్రిక్ సాధించారు. మొట్టమొదట 2001 లో హర్భజన్ సింగ్ ఆస్ట్రేలియాపై, 2006లో పాకిస్థాన్ పై ఇర్ఫాన్ పఠాన్ లు ఈ ఘనత సాధించారు. అయితే 13ఏళ్ల తర్వాత బుమ్రా హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి వీరిద్దరి రికార్డులను కూడా గుర్తుచేశాడు.  

ఈ క్రమంలోనే ఓ అభిమాని హర్భజన్ సింగ్ హ్యాట్రిక్ ప్రదర్శనకు సంబంధించిన వీడియోతో ఓ ట్వీట్ చేశాడు. '' 2001 హిస్టారిక్ కోల్‌కతా టెస్ట్. స్టీవ్ వాగ్ సారథ్యంలోని ఆసిస్ జట్టుపై హర్భజన్ సింగ్ అద్భుత హ్యాట్రిక్ ప్రదర్శన. వరుస బంతుల్లో  రికీ పాటింగ్, గిల్ క్రిస్ట్, షేన్ వార్న్ లను ఔట్ చేసి అతడు హ్యాట్రిక్ సాధించాడు. '' అంటూ సదరు అభిమాని  ట్వీట్ చేశాడు. 

ఈ ట్వీట్ పై మాజీ ఆసిస్ వికెట్ కీపర్ గిల్ క్రిస్ట్ స్పందించాడు. '' నో డిఆర్‌ఎస్'' అంటూ గిల్లీ ట్వీట్ చేశాడు. అంటే ఆ సమయంలో డిఆర్ఎ‌స్ వుండివుంటే తాను నాటౌట్ గా నిలిచేవాడిని...భజ్జీకి హ్యాట్రిక్ దక్కేదికాదని గిల్లీ అభిప్రాయం. కేవలం అంపైర్ తప్పిడు నిర్ణయంవల్లే హర్భజన్ హ్యాట్రిక్ సాధించాడని గిల్ క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు.

ఇలా తన హ్యాట్రిక్ ప్రదర్శనను తక్కువచేసేలా మాట్లాడిన గిల్లీపై హర్భజన్ విరుచుకుపడ్డాడు. '' కొందరు ఎప్పటికీ మారరు. అలాంటివారిలో నువ్వు(గిల్లీ) మొదటివరుసలో వుంటావు. ఎదుటివారి ఎదుగుదలను చూసి ఎడవడం ఇంకా మానలేనట్లున్నావు. అయినా నువ్వు అంతగొప్ప ఇన్నింగ్స్ లు ఏం ఆడావని మొదటి బంతికి  ఔట్ కాకపోడానికి. డీఆర్ఎస్ వున్నా లేకున్నా నేను ప్రతిభ గల  క్రికెటర్ నే...కానీ నువ్వు మాత్రం కాదు.'' అంటూ గిల్లీకి భజ్జీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.