వచ్చే ఏడాది మరోసారి క్రికెట్ పండగ రానుంది. ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికన ఐసిసి వన్డే ప్రపంచ కప్ సక్సెస్‌ఫుల్ గా ముగియగా వచ్చేఏడాది(2020లో) ఐసిసి టీ20 వరల్డ్ కప్ జరగనుంది. వన్డే ప్రపంచ కప్ ను తృటిలో మిస్సయిన భారత్ టీ20 వరల్డ్ కప్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని చూస్తోంది. అందుకోసం ముందునుండే ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని మాజీ టీమిండియా కెప్టెన్, చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే సెలెక్టర్లకు సూచించారు. కీలక నిర్ణయాలు డైలమాలో వుంటూనే తీసుకోవడం మంచిదికాదని కుంబ్లే అభిప్రాయపడ్డారు. 

ముఖ్యంగా సెలెక్టర్లు సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ విషయంలో ఓ క్లారిటీతో వుంటే బావుంటుందని కుంబ్లే తెలిపాడు. ధోని కూడా సరైన సమయంలో క్రికెట్ నుండి తప్పుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. కాబట్టి సెలెక్టర్లు చొరవ తీసుకుని అతడితో  ఓసారి చర్చిస్తే మనసులో ఏముందో తెలుస్తుందన్నారు. టీ20 వరల్డ్ కప్ కోసం జట్టును ఎంపికచేసే సమయంలో ఇదేంతో  ఉపయోగపడుతుందని ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీకి కుంబ్లే సూచించారు. 

''టీ20 వరల్డ్ కప్ ఎంతో దూరం లేదు. ఇప్పటినుండే  ఆ టోర్నీకి అనుగుణంగా భారత జట్టును సంసిద్దం చేస్తే బావుంటుంది. అందుకోసం సెలెక్టర్లు కొన్ని విషయాలపై ఓ స్పష్టతకు రావాల్సివుంటుంది. వన్డే ప్రపంచ కప్ పలితం పునరావృతం కాకుండా వుండాలంటే ముందస్తు వ్యూహాలను రచించడమే మన ముందున్న అత్యుత్తమ మార్గం. 

ధోని  విషయంలో ముందుగా సెలెక్టర్లు ఓ నిర్ణయానికి రావాలి. అతడిని టీ20 వరల్డ్ కప్ ఆడించాలో...వద్దో నిర్ణయించుకోవాలి. ఒకవేళ అతడిని ఆడించే ఉద్దేశ్యం లేకుంటే  అంతకుముందే రిటైర్మెంట్ కోసం ఓ అవకాశాన్ని ఇవ్వాలి. ఈ విషయంపై ధోనితో చర్చిస్తే బావుంటుంది. అతడి అభిప్రాయాలను తీసుకుని తుదినిర్ణయం తీసుకుంటూ బావుంటుంది.''  అని కుంబ్లే సూచించారు.