అంతర్జాతీయ క్రికెట్ లో ఒకే ఒక్కడు.. యశస్వి జైస్వాల్ మరో రికార్డు
Yashasvi Jaiswal : టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ 2024 లో ఇప్పటివరకు 13 మ్యాచ్ లను ఆడి.. రెండు సెంచరీలు, ఐదు అర్ధసెంచరీలతో 1,023 పరుగులు చేశాడు. ఇందులో తన అత్యుత్తమ స్కోరు 214* పరుగులు.
Yashasvi Jaiswal : భారత యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్రవేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ క్యాలెండర్ ఇయర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో 1,000 పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి క్రికెటర్ గా నిలిచాడు. పల్లెకెలెలో శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో జైస్వాల్ ఈ మైలురాయిని అందుకున్నాడు. వర్షం కారణంగా 78 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యశస్వి జైస్వాల్ కేవలం 15 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. 200.00 స్ట్రైక్ రేట్ తన బ్యాటింగ్ ను కొనసాగించాడు.
జైస్వాల్ ఈ ఏడాది కేవలం 13 మ్యాచ్‌ల్లో 63.93 సగటు, 94.54 స్ట్రైక్ రేట్‌తో రెండు సెంచరీలు, ఐదు అర్ధసెంచరీలతో 1,023 పరుగులు చేశాడు. ఇందులో తన అత్యుత్తమ ఇన్నింగ్స్ స్కోరు 214* పరుగులు. కాగా, జైస్వాల్ ఇప్పటివరకు వన్డే క్రికెట్ లో అరంగేట్రం చేయలేదు. దీంతో అతను కేవలం టెస్టు, టీ20 క్రికెట్ లో ఈ పరుగులు సాధించాడు. ఈ ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలోని రెండు, మూడు స్థానాల్లో శ్రీలంక ప్లేయర్ కుసల్ మెండిస్ (26 మ్యాచ్‌ల్లో 888 పరుగులు, ఆరు అర్ధసెంచరీలు), ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఇబ్రహీం జద్రాన్ (25 మ్యాచ్‌ల్లో 844 పరుగులు, ఒక సెంచరీ, ఎనిమిది అర్ధసెంచరీలు) ఉన్నారు.
ఈ ఏడాది ఆరు టెస్టుల్లో జైస్వాల్ 11 ఇన్నింగ్స్‌ల తర్వాత 74.00 సగటుతో 740 పరుగులు చేశాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు, మూడు అర్ధశతకాలు ఉన్నాయి. అతని అత్యుత్తమ స్కోరు 214* పరుగులు. అలాగే, ఏడు టీ20 మ్యాచ్ లలో రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. 175.77 స్ట్రైక్ రేట్, 47.16 సగటుతో 283 పరుగులు చేశాడు. ఇందులో జైస్వాల్ అత్యుత్తమ స్కోరు 77* పరుగులు.
ఇదే నా చివరి మ్యాచ్.. భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న