గతేడాది వరల్డ్ కప్ మ్యాచులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచుల్లో భారత్ విజయం సాధించకపోయినా... ఓ భారతీయ అభిమాని మాత్రం  ప్రపంచం దృష్టిని తనవైపు ఆకర్షించింది. ఆమె బామ్మ చారులత పటేల్. ఆ వరల్డ్ కప్ లో ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. అయితే... ఈ బామ్మ గురించి ఓ విషాద వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. జనవరి 13వ తేదీన ఆమె కన్నుమూశారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే... ప్రపంచకప్ లో భాగంగా టీం ఇండియా బంగ్లాదేశ్ తో తలపడింది. ఈ మ్యాచ్ లో విజయం భారత్ నే వరించింది. ఈ మ్యాచ్ గెలుపోటములకన్నా కూడా 87ఏళ్ల వయసుగల ఓ బామ్మ సెలబ్రెటీగా మారిపోయింది. మ్యాచ్ జరుగుతున్నంత సేపు టీం ఇండియా ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ... ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. 

మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మలు ఆమెను కలిసి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. దీంతో ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఈ వయసులో కూడా ఆమె చూపిస్తున్న ఉత్సాహానికి క్రికెట్ అభిమానులు కూడా ఫిదా అయిపోయారు. దీంతో.. అసలు ఈ బామ్మ ఎవరా అని వెతికే పనిలో పడ్డారు. దీంతో ఆమె గురించి షాకింగ్ విషయాలు తెలిశాయి.

ఎనభై ఏడేళ్ల ఆ బామ్మ పేరు చారులతా పటేల్‌. భారత సంతతికి చెందినవారు. అయితే ఆమె పుట్టింది, పెరిగిందీ విదేశాల్లోనే. బ్రిటన్‌కు రాక ముందు ఆమె దక్షిణాఫ్రికాలో ఉండేవారు. 1975లో బ్రిటన్‌కు వచ్చినప్పటి నుంచి అక్కడే స్థిరపడిపోయారు. అక్కడే ఉద్యోగం చేశారు. చిన్నప్పటి నుంచి క్రికెట్‌కు వీరాభిమాని. భారత్‌ మ్యాచ్‌లన్నింటినీ తప్పకుండా టీవీలో వీక్షించేవారు. 

రిటైర్‌ అయిన తరువాత బామ్మకు ఖాళీ దొరికింది. అప్పటి నుంచి ఇలా ప్రత్యక్షంగా స్టేడియానికి వచ్చి మరీ క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నారు. చారులతకు ఇద్దరు పిల్లలు. వారిలో ఒకరు భారత్‌లోనే ఉంటున్నారు. ఆయన పేరున్న బిల్డర్‌. కొడుకు కోసం భారత్‌కు వచ్చి వెళుతుంటారు చారులత.

1983లో భారత్‌ తొలిసారి ప్రపంచ కప్‌ గెలుచుకున్న ఘట్టాలను కూడా ఆమె ప్రత్యక్షంగా చూశారు. కపిల్‌దేవ్‌ నేతృత్వంలోని జట్టు ఆటను ఆసాంతం ఆస్వాదించారు. ‘అప్పట్లో ఫైనల్స్‌ చూడడానికి లార్డ్స్‌ స్టేడియానికి వెళ్లాను. నాడు కపిల్‌ జట్టు ప్రపంచ కప్‌ గెలిచింది. ఆ దృశ్యాలు ఇప్పటికీ నా కళ్లల్లో మెదులుతున్నాయి. ఆ రోజు ఎంతో గర్వంగా ఫీలయ్యాను. ఆనందం పట్టలేక స్టాండ్స్‌లో నాట్యం చేశాను’ అంటూ చారులత ఆనాటి జ్ఞాపకాలు పంచుకున్నారు.

అలా సెలబ్రెటీగా మారి అందరి దృష్టి ఆకర్షించిన బామ్మ చారులత... ఇటీవల అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులు తెలియజేశారు. కాగా... ఆమె మృతి పట్ల క్రికెట్ అభిమానులంతా విచారం వ్యక్తం చేస్తున్నారు.