ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్... సెమీ ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం..
బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో 51 పరుగుల తేడాతో గెలిచిన భారత జట్టు... శ్రీలంకతో జరిగిన సెమీ ఫైనల్‌లో 60 పరుగుల తేడాతో విజయం అందుకున్న పాకిస్తాన్...

ఎమర్జింగ్ ఆసియా కప్ 2023 టోర్నీ ఫైనల్‌లో ఇండియా, తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలబడనుంది. శ్రీలంకతో జరిగిన సెమీ ఫైనల్ 1లో పాకిస్తాన్ 60 పరుగుల తేడాతో విజయం అందుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో 51 పరుగుల తేడాతో గెలిచింది భారత జట్టు...
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా A జట్టు, 49.1 ఓవర్లలో 211 పరుగులకి ఆలౌట్ అయ్యింది. సాయి సుదర్శన్ 24 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేయగా అభిషేక్ శర్మ 63 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేశాడు.
నికిన్ జోష్ 17 పరుగులు చేయగా కెప్టెన్ యశ్ ధుల్ 85 బంతుల్లో 6 ఫోర్లతో 66 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. నిశాంత్ సింధు 5, రియాన్ పరాగ్ 24, ధృవ్ జురెల్ 1, హర్షిత్ రాణా 9, మనవ్ సుథార్ 21 పరుగులు చేయగా రాజవర్థన్ హంగర్‌గేకర్ 15 పరుగులు చేశాడు..
212 పరుగుల లక్ష్యఛేదనని బంగ్లాదేశ్ దూకుడుగా మొదలెట్టింది. తొలి వికెట్‌కి ఓపెనర్లు ఇద్దరూ కలిసి 70 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 12.3 ఓవర్లో 70 పరుగులు చేసిన బంగ్లాదేశ్ ఈజీగా గెలిచేలా కనిపించింది. 38 పరుగులు చేసిన మహ్మద్ నయీంని మనవ్ సుథార్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఆ తర్వాత జాకీర్ హసన్ 5 పరుగులు చేసి మనవ్ సుథార్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. తన్జీద్ హసన్ 51 పరుగులు చేయగా కెప్టెన్ సైఫ్ హసన్ 22 పరుగులు చేశాడు. మహ్మదుల్ హసన్ జాయ్ 20 పరుగులు చేయగా సౌమ్య సర్కార్ 5, అక్బర్ ఆలీ 2, మెహడీ హసన్ 12 పరుగులు చేశారు. రిపాన్ మొండల్ 5 పరుగులు చేయగా రకీబుల్ హసన్ డకౌట్ అయ్యాడు...
ఒకానొక దశలో 70/0 స్కోరుతో ఉన్న బంగ్లాదేశ్ A జట్టు, 90 పరుగుల తేడాలో 10 వికెట్లు కోల్పోయి 34.2 ఓవర్లలో 160 పరుగులకి ఆలౌట్ అయ్యింది. నిశాంత్ సింధు 5 వికెట్లు తీయగా మనవ్ సుథార్‌కి 3 వికెట్లు దక్కాయి. అభిషేక్ శర్మ, యువరాజ్‌సిన్హ్ దోహియా చెరో వికెట్ తీశారు..
మొదటి సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్ A జట్టు, శ్రీలంకపై 60 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 322 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఓమర్ యూసఫ్ 88, మహ్మద్ హారీస్ 52, ముబసిర్ ఖాన్ 42 పరుగులు చేశారు.
ఈ లక్ష్యఛేదనలో శ్రీలంక 45.4 ఓవర్లలో 262 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఆవిష్క ఫెర్నాండో 97, సహన్ అరచ్‌గే 97 పరుగులు చేసి పోరాడినా మిగిలిన బ్యాటర్ల నుంచి సరైన సహకారం దక్కకపోవడంతో శ్రీలంకకి పరాజయం తప్పలేదు.
జూలై 23న ఇండియా, పాకిస్తాన్ మధ్య కొలంబోలో ఎమర్జింగ్ ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో విజయం అందుకుంది.