మరికొద్దిరోజుల్లో దేశవ్యాప్తంగా జరిగే లోక్ సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటుహక్కును వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం ప్రజల్లో చైతన్యం కలిగించడానికి సీని, క్రీడా ప్రముఖుల సహకారాన్ని ఆయన కోరారు. ఇలా తాజాగా మోదీ తమను ఉద్దేశించి ఓటింగ్ శాతం పెరిగేలా చూడాలంటూ చేసిన అభ్యర్థనపై టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. 

'' మనం ఎంతగానో ప్రేమించే  దేశం కోసం ప్రతిఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా ముఖ్యం. మంచి  భవిష్యత్ కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి మనందరం ఓటేయడం ఓ బాధ్యతగా భావించాలని...ఇలా ప్రతి ఒక్కరు సీరియస్‌గా ప్రయత్నిస్తే ఓటింగ్ శాతం పెరగడం పెద్ద విశయమేమీ కాదు.'' అంటూ రోహిత్ ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు.  

అంతకుముందు ప్రధాని  మోదీ టీమిండియా సీనియర్ ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ట్విట్టర్  ద్వారా ఈ విధంగా సూచించారు. '' మీరందరు క్రికెట్లో గొప్పగొప్ప రికార్డులు సాధించారు. కానీ ఈసారి దేశంలోని 130 కోట్ల మందిని ఉత్తేజపరుస్తూ దేశవ్యాప్తంగా త్వరలో జరిగే ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేలా చేసి నయా రికార్డును సృష్టించాలని కోరుకుంటున్నా. అలా చేస్తే ప్రజాస్వామ్యం గెలుస్తుంది.''  అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.