మరో నెలరోజుల్లో ప్రపంచ కప్ వుందనగా టీమిండియాలో అలజడి మొదలయ్యింది. ఇప్పటికే అన్ని దేశాలు తమ తమ ఆటగాళ్లను ప్రపంచ కస్ కోసం సన్నద్దం చేయడానికి ఐపిఎల్ నుండి స్వేదేశానకి రప్పించాయి. ఇక ఐపిఎల్ కూడా దాదాపు ముగింపు దశకు చేరుకోవడంతో బిసిసిఐ కూడా ప్రపంచ కప్ జట్టు కోసం ఎంపికచేసిన ఆటగాళ్లకు ప్రత్యేకంగా సన్నద్దం చేయాలని భావిస్తోంది. ఇలాంటి కీలక సమయంలో ఐపిఎల్ లో చివరి లీగ్ మ్యాచ్ ఆడుతున్న చెన్నై ఆటగాడు కేదార్ జాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు.గాయం తీవ్రత అధికంగా వుండటంతో అతడు ఐపిఎల్ మొత్తానికి దూరమయ్యాడు. 

అయితే ఐపిఎల్ టోర్నీ ముగింపుకు, ప్రపంచ కప్ ఆరంభానికి కేవలం 15 రోజులు గ్యాప్ మాత్రమే వుంది. అంతేకాకుండా ఇంగ్లాండ్ వాతావరణ పరిస్థితులకు అలవాటుపడేందుకు  టీమిండియా పది రోజుల ముందే అంటే ఈ నెల 22న అక్కడికి  బయలేదేరనుంది. ఆ లోపు జాదవ్ గాయంతోనే బాధపడుతూ పిట్ నెస్ నిరూపించుకోకపోతే  మెగా టోర్నీకి దూరమయ్యే అవకాశాలున్నాయి.

అయితే అతడు ఒకవేళ జట్టుకు దూరమైతే ఇప్పటికే స్టాండ్ బై ఆటగాళ్లుగా వున్న అంబటి రాయుడు, రిషబ్ పంత్ లలో ఎవరో ఒకరికి ప్రపంచ కప్ ఆడే అవకాశం  రావచ్చు. అయితే జాదవ్ ప్లేస్ ఒకవేళ బర్తీచేయాల్సి వస్తే తప్పకుండా  అంబటి రాయుడితోనే చేయాలని  క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే రిషబ్ పంత్ బ్యాట్ మెన్ తో పాటు వికెట్ కీపర్ కూడా. కానీ  కేదార్ జాదవ్  స్పెషలిస్ట్ బ్యాట్ మెన్. కాబట్టి అనుభవం, అవసరం దృష్ట్యా రాయుడికే ప్రపంచ కప్ జట్టుతో పాటు ప్లైట్ ఎక్కే అవకాశాలున్నాయని  విశ్లేషకుల అభిప్రాయం. 

కేదార్ కు రేసు  వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు చెన్నై కోచ్  ప్లెమింగ్ తెలిపాడు.  వైద్యుల నివేదిక ఆధారంగా  అతడి ప్రపంచ కప్  భవితవ్యం  ఆధారపడి వుంటుందని ... ప్రస్తుతానికి అతడు ఐపిఎల్ కు దూరమయ్యాడని తెలిపాడు. దీంతో మే 22వ తేదీ వరకు అతడు  కోలుకునే పరిస్థితి లేనట్లు తేలితే   ప్రత్యామ్నాయంగా ఎవర్ని పంపాలనే విషయంపై సెలెక్టర్లు ముందే నిర్ణయం తీసుకోనున్నారు. అందుకు సంబంధించిన చర్చలు కూడా ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం.