ఇంగ్లాండ్ వేదికగా ఈ ఏడాది జరగనున్న ప్రపంచ దేశాల సమరంలో భారత్ తరపున తలపడే ఆటగాళ్లను బిసిసిఐ ఇప్పటికే ప్రకటించింది. అయితే కొందరు ఆటగాళ్ళ ఎంపికలో టీమిండియా సెలెక్టర్లు వైవిధ్యంగా వ్యవహరించారు. ముందునుంచి ప్రపంచ కప్ జట్టులో చోటు ఖాయం అనుకున్న ఆటగాళ్లను కాకుండా వేరేవాళ్లను ఎంపిక చేశారు. దీనిపై వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. 

తమ నిర్ణయంపై గుర్రుగా వున్న ఆటగాళ్లను సముదాయించడానికి సెలెక్టర్లే కాదు వారు ఆశించిన స్థానాల్లో ఎంపికైన ఆటగాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఇలా ప్రపంచ కప్ జట్టులో తన ఎంపిక గురించి  మొదటిసారి మాట్లాడిన దినేశ్ కార్తిక్ యువ క్రికెటర్ రిషబ్ పంత్ ను ఓదార్చే ప్రయత్నం చేశారు. 

ప్రపంచ కప్ కోసం అన్ని జట్లూ కేవలం 15మంది ఆటగాళ్లనే ఎంపిక చేయాల్సి వుంటుందని దినేశ్ కార్తిక్ తెలిపాడు. ఈ క్రమంలో కొందరికి అవకాశం రావడం మరికొందరికి రాకపోవడం జరుగుతుందన్నాడు. అయితే ఇలాంటి మెగా టోర్నీలో కొద్దిలో అవకాశాన్ని కోల్పోయిన ఆటగాళ్లు అధికంగా బాధపడటం సహజమని అన్నాడు. అయితే ఆటలో సహజత్వాన్ని గుర్తించి బాధ నుండి బయటకు రావాలని పరోక్షంగా పంత్ ని ఉద్దేశించి మాట్లాడారు. 

ఇక భవిష్యత్ తాను, పంత్ కలిసి ఆడే అవకాశం వస్తూ తప్పకుండా తాను స్వాగతిస్తానని కార్తిక్ వెల్లడించారు. ప్రస్తుతం ధోనీతో కలిసి  ఆడుతున్నట్లే పంత్ తో కూడా కలిసి ఆడతానని...అతడితో డ్రెస్సింగ్ రూం పంచుకోడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు. ప్రత్యేక ఆటతీరును కలిగివున్న పంత్ కి ఇంకా చాలా భవిష్యత్ వుందని... ఇంకా చాలా ఏళ్లు అతడు క్రికెట్ ఆడతాడని కార్తిక్ పేర్కొన్నాడు. 

యువకుడైన రిషబ్ పంత్ కి తన అవకాశాల గురించి అవగాహన ఉందని కార్తిక్ తెలిపాడు.అంతర్జాతీయ క్రికెట్లో ఏదైన ప్రత్యేకత కనబరిస్తే అవకాశాలు వాటంతట అవే వస్తాయన్నాడు. అలా ప్రయత్నించే తాను ప్రపంచకప్‌ జట్టులో రెండోసారి చోటు దక్కించుకోగలిగానని...అందుకు ఆనందంగా వుందని కార్తిక్ వెల్లడించాడు.