25 ఏళ్ల క్రికెట్ కెరీర్ సంతృప్తికరంగా సాగిదంటూ సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్టు చేసిన వినయ్ కుమార్...మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో భారత జట్టులో చోటు దక్కించుకున్న వినయ్ కుమార్...

భారత పేస్ బౌలర్ వినయ్ కుమార్, క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వినయ్ కుమార్, భారత జట్టు తరుపున 31 వన్డేలు, ఓ టెస్టు మ్యాచ్ ఆడాడు. వన్డేల్లో 48 వికెట్లు తీసిన వినయ్ కుమార్, టెస్టుల్లో ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మాత్రం అద్భుతంగా రాణించాడు వినయ్ కుమార్.


99 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచులు ఆడిన వినయ్ కుమార్, 462 వికెట్లు పడగొట్టి, రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. ‘దేవనగర ఎక్స్‌ప్రెస్‌’గా పిలువబడిన వినయ్ కుమార్, ఐపీఎల్‌లో కొచ్చి టస్కర్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఆడాడు. 

2010 సీజన్‌లో 16 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా నిలిచిన వినయ్ కుమార్, 37 ఏళ్ల వయసులో క్రికెట్‌ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. వినయ్ కుమార్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ‘థ్యాంక్యూ వినయ్ కుమార్’ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు కర్ణాటక క్రికెట్ అభిమానులు..