దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సీరిస్ లో కోహ్లీసేన అదిరిపోయే ఆరంభం లభించింది. గాంధీ జయంతి రోజున(అక్టోబర్ 2)  విశాఖపట్నంలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో మొదటి టెస్ట్ ప్రారంభమయ్యింది. ఇందులో మొదటిసారి ఓపెనర్ గా బరిలోకి దిగిన సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. భారీ సెంచరీ(176 పరుగులు)తో చెలరేగిన అతడు ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్ సర్ బ్రాడ్ మన్ సరసన నిలిచాడు. 

ఇప్పటివరకు రోహిత్ టెస్ట్ ఫార్మాట్ లో 15 ఇన్నింగ్సులు ఆడాడు. ఇందులో అతడు ఏకంగా 98.22 యావరేజ్ తో పరుగులు సాధించాడు. ఇలా నాలుగు సెంచరీలు ఐదు హాఫ్ సెంచరీలతో 884 పరుగులు సాధించాడు.  ఇలా 10కంటే ఎక్కువ ఇన్నింగ్సుల్లో ఇంత ఎక్కువ యావరేజ్ తో పరుగులు సాధించిన ఆటగాళ్లు ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో ఒక్కరే వున్నారు. అతడే ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం సర్ బ్రాడ్‌మన్.  

బ్రాడ్‌మన్‌ తన సొంత గడ్డ ఆస్ట్రేలియాలో ఆడిన 50 ఇన్నింగ్సుల్లో 98.22 సగటు సాధించాడు. ఇదే సగటుతో రోహిత్‌ కూడా తన స్వదేశంలో పరుగులు సాధించాడు. సేమ్ బ్రాడ్‌మన్ మాదిరిగానే రోహిత్ కూడా స్వదేశంలో 98.22 సగటుతో పరుగులు సాధించి సమానంగా నిలిచాడు. అయితే బ్రాడ్‌మన్ మాదిరిగా 50 ఇన్నింగ్సుల వరకు రోహిత్ ఈ యావరేజ్ లో పరుగులు సాధించడం చాలా కష్టం. ఒకవేళ సాధిస్తే టెస్ట్ క్రికెట్ చరిత్రలో రోహిత్ పేరు చిరస్థాయిలో నిలవనుంది.

ఇక ఇదే ఇన్నింగ్స్ ద్వారా రోహిత్ మరో అరుదైన ఘనతను కూడా సాధించాడు. టెస్టుల్లో ఓపెనర్ గా ఆరంగేట్రం చేసిన మ్యాచులో శిఖర్ ధవన్, రాహుల్, పృథ్విషాలు సెంచరీలు సాధించారు. తాజాగా రోహిత్ శర్మ కూడా ఈ జాబితాలో చేరాడు.