టీమిండియా యువ వికెట్ రిషబ్ పంత్ లెజెండరీ ప్లేయర్ ధోని స్థానంలో భారత జట్టులోకి వచ్చాడు. కానీ ఆ అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు.ధోని స్థానానికి న్యాయం చేయడంలో అతడు ఘోరంగా విఫలమయ్యాడు. గతంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్, ఐపిఎల్ లో అద్భుతాలు సృష్టించిన అతడు అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చేసరికి మాత్రం చతికిలపడ్డాడు. అయితే ఇన్నాళ్లు  విఫలమైన ప్రతిసారి అతడికి  అవకాశాలిస్తూ వచ్చిన టీమ్ మేనేజ్ మెంట్ తాజాగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది.  దీంతో ఇక అతడి విషయంలో కఠిన నిర్ణయం తీసుకునే ఆలోచనలో టీమిండియా మేనేజ్‌మెంట్ వున్నట్లు తెలుస్తోంది. 

ఇటీవల ముగిసిన వెస్టిండిస్ పర్యటన మొత్తానికి రెగ్యులర్ వికెట్ కీపర్ ధోని దూరమవడంతో రిషబ్ పంత్ పూర్తిస్థాయి వికెట్ కీపర్ గా మారాడు. అయితే ఈ  సీరిస్ మొత్తంలోనూ అతడు ఘోరంగా విఫలమయ్యాడు. టీ20, వన్డేల్లోనే కాకుండా టెస్ట్ సీరిస్ లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో వన్డే ప్రపంచ కప్ కు ముందు అతడికి మద్దతుగా నిలిచిన అభిమానులే విమర్శించడం ప్రారంభించారు. ఇక స్వదేశంలో సౌతాఫ్రికాతో ముగిసిన టీ20 తర్వాత అయితే పంత్ ను జట్టులోంచి తొలగించాలన్న డిమాండ్ మరీ ఎక్కువయ్యింది. 

ఇక గంభీర్ వంటి మాజీ ఆటగాళ్లయితే టీమిండియా మేనేజ్‌మెంట్ అతిప్రేమే పంత్ ఇంకా టీంలో కొనసాగేలా చేస్తుందంటూ ఆరోపిస్తున్నారు. దీంతో ఈ ఆరోపణలు మరీ   ఎక్కువకాకముందే జాగ్రత్తపడాలని  క్రికెట్ పెద్దలు బావిస్తున్నారట. అందుకోసమే సౌతాఫ్రికాతో టెస్ట్ సీరిస్ లోనే పంత్ పై చర్యలు తీసుకోడానికి సిద్దమైనట్లు సమాచారం. 

వైజాగ్ వేదికన అక్టోబర్ 2 నుండి టెస్ట్ సీరిస్ ప్రారంభంకానుంది. ఈ టెస్ట్ సీరిస్ లో పంత్ ను కాకుండా వృద్దిమాన్ సాహాను ఆడించాలని చూస్తోంది. దీంట్లో ఒకవేళ అతడు రాణిస్తే మరికొన్ని అవకాశాలిచ్చి ప్రోత్సహించాలని చూస్తున్నారట. మళ్లీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సత్తా చాటితేనే పంత్ కు అంతర్జాతీయ మ్యాచుల్లో అవకాశమివ్వాలన్న ఆలోచనలో మేనేజ్‌మెంట్ వున్నట్లు సమాచారం. 

ఇక ఇన్నాళ్లు పంత్ కు అండగా నిలిచిన కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రిలు కూడా మేనేజ్‌మెంట్ నిర్ణయాన్నే సమర్థిస్తున్నారట. దీంతో పంత్ కు టీమిండియాలో దారులు దాదాపు మూసుకుపోయినట్లేనని క్రికెట్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఒకవేళ సాహా కాకుండా టెస్టులో కూడా పంతే బరిలోకి దిగితే అది  అతడి అదృష్టమనే అనుకోవాలని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.