టీమిండియా విధించిన 157 పరుగుల టార్గెట్‌ను ఆడుతూ పాడుతూ కొట్టేసింది ఇంగ్లాండ్ జట్టు. గత మ్యాచ్‌లో డకౌట్ అయిన ఇంగ్లీష్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ అద్బుత ఇన్నింగ్స్‌తో ఒంటిచేత్తో ఇంగ్లాండ్‌కి విజయాన్ని అందించాడు.

గత రెండు మ్యాచుల్లో 40+ పరుగులు చేసిన జాసన్ రాయ్‌ 13 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బౌండరీలతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు జోస్ బట్లర్. 17 బంతుల్లో ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేసిన డేవిడ్ మలాన్, సుందర్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు.

ఆ తర్వాత టీమిండియా బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో భారీ విజయం అందుకుంది. బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌తో అనవసర తప్పిదాలు చేసిన టీమిండియా, భారీ మూల్యం చెల్లించుకుంది. 

బెయిర్ స్టో 28 బంతుల్లో 5 ఫోర్లతో 40 పరుగులు చేయగా, జోస్ బట్లర్ 52 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.