అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ క్రికెటర్ ఎవరంటే టక్కున వినిపించే పేరు సచిన్ టెండూల్కర్. ఇక భారత్ లో అయితే క్రికెట్ ప్రియులకు అతడో దేవుడు. సచిన్ క్లాసీ ఇన్నింగ్స్ లకు ఫిదాకాని అభిమాని భారత గడ్డపై వుండటని అనడంలో అతిశయోక్తి వుండదు. అతడి బ్యాట్ నుండి పరుగులు వరదలా పారడమే గొప్ప విషయం అనుకుంటే అంతర్జాతీయి క్రికెట్లో వంద సెంచరీల అరుదైన రికార్డు నెలకొల్పిన మరింత ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. అయితే ఇలా తాను జట్టు కోసం ఎంత అంకితభావంతో కష్టపడేవానో చూడండంటూ సచిన్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

టీమిండియా స్వదేశంలోనే పులి...విదేశాల్లో పిల్లి అన్న అపవాదు సచిన్ క్రికెట్ ఆడే కాలంలో వుండేది. ముఖ్యంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి ఫాస్ట్ పిచ్ లపై భారత బ్యాట్ మెన్స్ ఎక్కువగా తడబడేవారు. శరీరంపైకి వేగంగా దూసుకొచ్చే బంతులను ఎదుర్కోడంలో వారు బాగా ఇబ్బంది పడేవారు. సచిన్ కూడా అంతర్జాతీయ జట్టులో  చేరిన తొలినాళ్లలో ఈ ఇబ్బందులను చవిచూశాడు. 

కానీ ఈ సమస్యను అధిగమించడానికి అతడో చక్కటి ఉపాయాన్ని కనుక్కున్నాడు. ఆయా దేశాల్లో వుండే ఫాస్ట్ పిచ్ ల కంటే కఠినంగా వుండే పిచ్ లపై సాధన చేయడం ప్రారంభించాడు. నీటితో కూడిన పిచ్ ను తయారుచేయించుకుని దాంట్లో రబ్బరు బంతితో సాధన చేశాడు. ఇలా ప్రత్యేకంగా తయారుచేయించుకున్న పిచ్ లపై అతడు కఠొర సాధన చేసేవాడు. ఇలా గతంలో తాను బ్యాటింగ్ సాధన చేస్తున్న వీడియోను సచిన్ తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. 

ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన సచిన్ నేటి యువ క్రికెటర్లకు ఓ సందేశమిచ్చాడు. '' ఆటపట్ల ప్రేమ, అంకితభావం వుంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితులయినా ఎదుర్కొనే కొత్త మార్గం దొరుకుతుంది. ఇది మనకు ఎంతో ఎంజాయ్‌మెంట్ ఇస్తుంది. '' అని సచిన్ పేర్కొన్నాడు. అంటే అంకితభావంతో కష్టపడితే అది అందించే ఫలితం ఎంతో ఆనందాన్నిస్తుందన్నది సచిన్ నేటితరం యువ  క్రికెటర్లకు హితభోద చేశాడు. 

ఇలా సచిన్ కు ఆటపట్ల  వున్న అంకితభావాన్ని  తెలియజేసే వీడియో అభిమానులు ఎంతగానో నచ్చింది. దీంతో వారు దీనిపై తెగ కామెంట్స్ చేయడమే కాదు ఇతరులకు కూడా షేర్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ బాగా వైరల్  అవుతోంది. 


వీడియో