టీమిండియాలో విభేదాలు, గ్రూపులపై వస్తున్న వార్తలను హెడ్ కోచ్ రవిశాస్త్రి కొట్టిపారేశారు. వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరే ముందు ముంబైలో కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి రవిశాస్త్రి మీడియాతో మాట్లాడారు.

క్రికెటర్ల భార్యలు బౌలింగ్, బ్యాటింగ్ చేస్తున్నారనే వార్తలు అతి త్వరలోనే చదువుతారని.. పరిస్ధితి ఆ స్థాయికి దిగజారిందన్నాడు. జట్టులో ఆటకన్నా ఎవరు గొప్ప కాదు.. అది కోహ్లీ అయినా, నేనైనా అందరం జట్టుకోసం ఆలోచించేవాళ్లమే.

టీమిండియాలో విభేదాలుంటే అన్ని ఫార్మాట్లలో ఇంత నిలకడగా.. ఇన్నేళ్లు ఏ జట్టు రాణించేది కాదు. డ్రెస్సింగ్ రూంని పంచుకున్న వ్యక్తిగా చెబుతున్నానని.. జట్టులో ఎలాంటి విభేదాలు లేవని రవిశాస్త్రి తెలిపాడు.

ప్రపంచకప్ భారత్ గెలవాల్సిందని కానీ.. దురదృష్టవశాత్తు చేజారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. వరల్డ్‌కప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ ఆరంభంలోని తొలి 30 నిమిషాలు ఎంతో గుణపాఠాన్ని నేర్పిందని చెప్పుకొచ్చాడు.

అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. జట్టులో అంతా బాగుందని.. ఎవరో కావాలని ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. కోచ్‌గా రవిశాస్త్రికే తన ఓటని... కోచ్ ఎంపిక విషయంపై బీసీసీఐ మేనేజ్‌మెంట్ తనను ఇంతవరకు అడగలేదని స్పష్టం చేశాడు.

తన అభిప్రాయం అడిగితే మాత్రం రవిశాస్త్రిని కోచ్‌గా కొనసాగించాలని విరాట్ కోహ్లీ స్పష్టం చేశారు. కాగా..వెస్టిండీస్ పర్యటనలో భాగంగా కోహ్లీసేన రెండు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడునుంది.