ఇంగ్లాండ్ వేదికన జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా అదరగొట్టినా ట్రోఫీని మాత్రం అందుకోలేకపోయింది. లీగ్ దశలో వరుస విజయాలతో దూసుకుపోయిన కోహ్లీసేన సెమీస్ న్యూజిలాండ్ చేతిలో ఓటమిని చవిచూసింది. ఈ ఒక్క ఓటమి భారత జట్టును టోర్నీనుండే వైదొలిగేలా చేసింది. ఇలా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగి అదే స్థాయి ఆటతీరు కనబర్చి కూడా భారత జట్టు సెమీస్ నుండే  వెనుదిరగడం తననెంతో బాధించిందని రవిశాస్త్రి అన్నాడు. తాను చీఫ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియాకు ఎదురైన అతిపెద్ద పరాభవం ఇదేనని ఆయన పేర్కొన్నాడు. 

మరోసారి టీమిండియా చీఫ్ కోచ్ గా ఎంపికైన రవిశాస్త్రి మీడియాతో మాట్లాడుతూ కోహ్లీసేన ప్రపంచ కప్ ప్రదర్శనను గుర్తుచేసుకున్నాడు. ముఖ్యంగా న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ తనకు పీడకలను మిగిల్చిందన్నాడు. గత రెండేళ్లుగా జట్టును విజయపథంలో నడపడానికి తాను ఎంతో కష్టపడ్డానని... అందుకు తగిన గుర్తింపు కూడా లభించిందన్నాడు. కానీ ప్రపంచ కప్ సెమీస్ ఓటమితో ఒక్కసారిగా తనపై విమర్శలు మొదలయ్యాయని రవిశాస్త్రి తెలిపాడు. 

అయితే ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ కంటే టీమిండియానే అద్భుతంగా ఆడిందన్నాడు. కివీస్ బ్యాటింగ్ చేసిన సమయంలో పిచ్ కు...భారత్ బ్యాటింగ్ కు దిగినప్పుడు వున్న పిచ్ కు చాలా  తేడా వుందని గుర్తుచేశాడు. అలాంటి  పిచ్ పై భారత బ్యాట్స్ మెన్స్ బాగా ఆడారు. కానీ మొదటి 30 నిమిషాలపాటు సాగిన మ్యాచ్ మా విజయావకాశాలను దెబ్బతీసిందని రవిశాస్త్రి వెల్లడించాడు. 

ఈ చేదు జ్ఞాపకాలను మరిచిపోయి మళ్లీ కొత్తగా తన పనిని ప్రారంభిస్తానని అన్నాడు. ఈసారి ఐసిసి టీ20 ప్రపంచ కప్, టెస్ట్ చాంపియన్ షిప్ లలో టీమిండియాను విజేతగా నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపాడు. అందుకోసం ఆటగాళ్లను మరింత మెరుగ్గా సన్నద్దం చేస్తానని రవిశాస్త్రి అన్నాడు.