ఇకపై మెన్ ఇన్ బ్లూ కు నాలుగో స్థానంలో బ్యాటింగ్ అనేది ఓ సమస్య వుండదని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. యుక కిలాడీ శ్రేయాస్ అయ్యర్ రూపంలో నాలుగో స్థానానికి న్యాయం చేయగల సత్తా వున్న ఆటగాడు దొరికాడని ఆయన అన్నాడు.
నాలుగో స్థానంలో బ్యాటింగ్... గత కొన్నేళ్లుగా టీమిండియాను వేదిస్తున్న సమస్య. ప్రపంచ కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో సైతం భారత జట్టును ఈ సమస్య వేధించింది. కానీ ఇకపై మెన్ ఇన్ బ్లూ కు ఆ సమస్య వుండదని హెడ్ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. యుక కిలాడీ శ్రేయాస్ అయ్యర్ రూపంలో నాలుగో స్థానానికి న్యాయం చేయగల సత్తా వున్న ఆటగాడు దొరికాడని ఆయన అన్నాడు.
''చాలాకాలంగా నాల్గో స్ధానానికి సరిపోయే ఆటగాడి కోసం అన్వేషిస్తున్నాం. చాలా మంది యువ ఆటగాళ్ళను ఆ స్థానంలో ఆడించి ప్రయోగాలు చేశాం. అయితే ఎవరు కూడా ఆ స్థానంలో రాణించలేకపోయారు. ఎంతో కీలకమైన ఆ స్థానంలో స్థిరమైన ఆటగాడు లేక ఇన్నాళ్లు ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఆ సమస్యకు శ్రేయాస్ అయ్యర్ రూపంలో పరిష్కారం దొరికిందని అనుకుంటున్నా. విండీస్ తో జరిగిన వన్డే సీరిస్ లో అతడు అదరగొట్టాడు. ఇకపై కూడా అతన్ని ఆ స్థానంలోనే ఆడించాలని భావిస్తున్నాం. తదుపరి సీరిసుల్లో కూడా అతడికి మరిన్ని అవకాశాలిచ్చి ప్రయోగిస్తాం.'' అంటూ శ్రేయాస్ అయ్యర్ ఆటతీరునే రవిశాస్త్రి ప్రశంసించాడు.
భారత్-విండీస్ మధ్య జరిగిన మూడు వన్డేలకు వర్షం అంతరాయం కలిగించింది. దీని వల్ల మొదటి వన్డే పూర్తిగా తుడిచిపెట్టుకుని పోగా రెండు, మూడు వన్డేల్లో డక్ వర్త్ లూయిస్ పద్దతిన ఫలితం తేలింది. అయితే కోహ్లీ రెండో వన్డే(120 పరుగులు 125 బంతుల్లో), మూడో వన్డే (114 పరుగులు 99 బంతుల్లో) వరుస సెంచరీలతో, యువకెరటం శ్రేయాస్ అయ్యర్ రెండో వన్డే(71 పరుగులు 68 బంతుల్లో), మూడో వన్డేలో(65 పరుగులు 41 బంతుల్లో)వరుస హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దీంతో భారత జట్టు వెస్టిండిస్ పై పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించి వరుస విజయాలను అందుకుంది.
ఈ సీరిస్ లో కోహ్లీ సాధించిన సెంచరీల కంటే అయ్యర్ హాఫ్ సెంచరీలే అభిమానులతో పాటు టీమిండియా మేనేజ్ మెంట్ ను ఆకట్టుకున్నాయి. ఎందుకంటే అతడు నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగి ఈ పరుగులు సాధించాడు కాబట్టి. ఒత్తిడిని అధిగమించి కీలక సమయంలో కీలక స్థానంలో రాణించిన అతడిని తదుపరి మ్యాచుల్లో కూడా కొనసాగించాలని టీమిండియా మేనేజ్ మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ విషయం రవిశాస్త్రి మాటలను బట్టి అర్థమవుతోంది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 18, 2019, 10:21 PM IST