వందో టెస్టు ఆడుతున్న విరాట్ కోహ్లీని ‘గార్డ్ ఆఫ్ హానర్’తో క్రీజులోకి ఆహ్వానించిన భారత జట్టు..
వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్న భారత మాజీ సారథి విరాట్ కోహ్లీని ‘గార్డ్ ఆఫ్ హానర్’తో గౌరవించింది భారత జట్టు. భారత జట్టు ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఫీల్డింగ్ కోసం గ్రౌండ్‌లోకి చేరుకుంటున్న సమయంలో విరాట్ కోహ్లీని వెనక్కి వెళ్లాల్సిందిగా సూచించాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ...
మిగిలిన ప్లేయర్లు అందరూ వరుసగా నిలబడి, ‘గార్డ్ ఆఫ్ హానర్’తో విరాట్ కోహ్లీని గ్రౌండ్‌లోకి ఆహ్వానించారు. విరాట్ కోహ్లీ తన స్టైల్‌లో ఓ చేతిని పైకెత్తి, అభివాదం చేస్తూ మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చాడు...
కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న విరాట్ కోహ్లీ, తొలి ఇన్నింగ్స్‌లో రెండు రికార్డులు తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయిని అందుకున్న విరాట్ కోహ్లీ, టెస్టుల్లో ఈ ఫీట్ సాధించిన ఆరో భారత బ్యాటర్‌గా నిలిచాడు... ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే 8 వేలకు పైగా టెస్టు పరుగులు సాధించారు...
సచిన్ 154 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల పరుగుల మైలురాయి అందుకుంటే, ద్రావిడ్ 158, వీరేంద్ర సెహ్వాగ్ 160, సునీల్ గవాస్కర్ 166 ఇన్నింగ్స్‌ల్లో అందుకున్నారు. విరాట్ కోహ్లీ తన 169 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధించాడు...
తన 100వ టెస్టులో 8 వేల టెస్టు పరుగులను అందుకున్న రెండో క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఇంతకుముందు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ ఫీట్ సాధించాడు... 76 బంతుల్లో 5 ఫోర్లతో 45 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, యంగ్ స్పిన్నర్ ఎంబూల్దెనియా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...
తన ఇన్నింగ్స్‌లో కొట్టిన ఐదు ఫోర్లతో టెస్టు కెరీర్‌లో 900+ ఫోర్లు పూర్తి చేసుకున్నాడు. టీమిండియా తరుపున టెస్టుల్లో అత్యధిక ఫోర్లు బాదిన ప్లేయర్‌గా ఆరో స్థానంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ... సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో 2058 టెస్టు ఫోర్లు కొట్టగా, రాహుల్ ద్రావిడ్ 1651, వీరేంద్ర సెహ్వాగ్ 1219, వీవీఎస్ లక్ష్మణ్ 1135, సునీల్ గవాస్కర్ 1016 ఫోర్లు బాదారు. టెస్టు కెరీర్‌లో 900 ఫోర్లు కొట్టిన సౌరవ్ గంగూలీ రికార్డును అధిగమించాడు విరాట్ కోహ్లీ...
తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 574 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది టీమిండియా. రవీంద్ర జడేజా 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ 96 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ 61, హనుమ విహారి 58 పరుగులు చేశారు.
శ్రీలంక ఇన్నింగ్స్‌ను ఫోర్‌తో మొదలెట్టింది. మహ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతికి బౌండరీకి తరలించాడు లంక ఓపెనర్ తిరుమన్నే. 17 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది శ్రీలంక. పిచ్ నుంచి బౌలర్లకు ఎలాంటి సహకారం లభించకపోవడంతో నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు లంక ఓపెనర్లు...
