Asianet News TeluguAsianet News Telugu

ధోనీపై ఎమోషనల్ అయిన విరాట్ కోహ్లీ.. ‘టెస్టు కెప్టెన్సీ వదులుకున్నప్పుడు ఆయన మాత్రమే.. ’

మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఎంఎస్ ధోనీ పట్ల ఎమోషనల్ అయ్యారు. తాను టెస్టు కెప్టెన్సీ వదులుకున్నప్పుడు అది వరకు తాను ఆడిన వారిలో కేవలం ధోనీ మాత్రమే స్పందించి తనకు వ్యక్తిగతంగా మెస్సేజ్ పెట్టాడని వివరించారు.
 

team india former skipper virat kohli praises MS Dhoni for geniune friendship citing giving up test captaincy
Author
First Published Sep 5, 2022, 2:35 AM IST

న్యూఢిల్లీ: భారత టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ముఖ్యంగా ఎంఎస్ ధోనీని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఆయన మానసికంగానూ ఇబ్బంది పడ్డ రోజులను గుర్తు చేసుకుంటూ ధోనీ ప్రస్తావన తెచ్చాడు. టెస్టు కెప్టెన్సీ నుంచి తాను వైదొలిగినప్పుడు కేవలం ఎంఎస్ ధోనీ మాత్రమే తనకు వ్యక్తిగతంగా మెస్సేజ్ చేశాడని వివరించాడు. ‘నా నెంబర్ చాలా మంది దగ్గర ఉన్నది. కానీ, ఎవరూ నన్ను ఆ క్లిష్ట పరిస్థితుల్లో రీచ్ కాలేదు. కేవలం ధోనీ మాత్రమే నాకు మెస్సేజ్ చేశాడు’ అని ఎమోషనల్ అయ్యాడు.

విరాట్ కోహ్లీ కష్టసమయంలో ఉన్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. వివాదాస్పదంగా వన్డే కెప్టెన్సీ నుంచి ఆయనను తప్పించిన కాలాన్ని గుర్తు చేశాడు. ఆ తర్వాత ఈ ఏడాది తొలినాళ్లలో టెస్టు కెప్టెన్సీకి విరాట్ గుడ్ బై చెప్పాడు. ఆ సమయంలో తాను మానసికంగానూ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. అయితే, నెల రోజుల బ్రేక్ తర్వాత తాను ఇప్పుడు మళ్లీ ఫ్రెష్‌గా క్రీజులోకి దిగానని వివరించాడు.

‘నేను టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగినప్పుడు నాకు ఫస్ట్ మెస్సేజీ ఎంఎస్‌డీ నుంచి వచ్చింది. నేను అంతకు ముందు కలిసి ఆడిన వారందరిలో కేవలం ఆయనే నాకు మెస్సేజ్ చేశాడు. నా నెంబర్ చాలా మంది దగ్గర ఉన్నది. కానీ, కేవలం ఎంఎస్ మాత్రమే మెస్సేజ్ చేశాడు. ఇద్దరి ఆటగాళ్ల మధ్య గౌరవం ఉన్నప్పుడే ఒక ప్రత్యేక అనుబంధం ఉంటుంది. నాకు ఎప్పుడు కావాలనుకున్నా ఎంఎస్‌డీని వ్యక్తిగతంగా చేరుకోగలను’ అని విరాట్ కోహ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

ఇటీవలి కాలంలో విరాట్ కోహ్లీకి చాలా మంది చాలా వేదికల పై నుంచి పలు సలహాలు ఇచ్చారు. వాటన్నింటికీ సింపుల్‌గా కౌంటర్ ఇచ్చాడు. ‘అనేక వేదికల పై నుంచి ఎందరో నాకు ఇస్తున్న సలహాలు ముఖ్యం కావు. నేను ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే.. ఆ వ్యక్తిని పర్సనల్‌గా రీచ్ అవుతాను. అందరి ముందు బహిరంగంగా మీరు నాకు సలహాలు ఇవ్వాలనుకుంటే.. నేను వాటికి విలువ ఇవ్వను’ అని స్పష్టం చేశాడు. 

విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన టీ20 ఫార్మాట్‌లో తన 32వ హాఫ్ సెంచరీ సాధించాడు. ఆయన సాధించిన 60 పరుగులు టీమిండియా 181 పరుగుల లక్ష్యాన్ని పాక్ ముందు ఉంచడంలో దోహదపడ్డాయి. నరాలు తెంపే ఉత్కంఠలో పాకిస్తాన్ టీమ్ ఆ లక్ష్యాన్ని ఛేదించడం మరో అంశం.

Follow Us:
Download App:
  • android
  • ios