MS Dhoni: బెంగళూరులో ధోని క్రికెట్ అకాడమీ.. రేపే ప్రారంభం.. యువ క్రికెటర్లకు గొప్ప అవకాశం
MS Dhoni Cricket Academy: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించాడు. మరికొద్దిరోజుల్లో ఐపీఎల్ నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటించబోతున్న ఈ మిస్టర్ కూల్ కెప్టెన్.. తాజాగా యంగ్ జనరేషన్ క్రికెటర్లను వెలికితీసే పనిలో పడ్డాడు.
భారత క్రికెట్ లో శిఖరమంత స్థాయికి ఎదిగిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని త్వరలోనే కొత్త అవతారమెత్తనున్నాడు. కర్నాటక రాజధాని బెంగళూరులో నెలకొల్పిన క్రికెట్ అకాడమీకి సహాయ సహకారాలు అందించనున్నాడు. ఆర్కా స్పోర్ట్స్ ఆధ్వర్యంలో గేమ్ ప్లే అనే సంస్థ బెంగళూరులో ‘ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీ’ని ప్రారంభించబోతున్నది.
ఈనెల 12న బెంగళూరలో దీనిని అధికారికంగా ప్రారంభించబోతున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ అకాడమీ లాంచ్ కాబోతున్నది. యువ క్రికెటర్లను వెలికితీసే పనిలో భాగంగా ‘MS Dhoni Cricket Academy’ని స్థాపించినట్టు గేమ్ ప్లే నిర్వాహకులు తెలిపారు. కాగా, ఈ అకాడమీకి ధోని మెంటార్ గా వ్యవహరించనున్నాడు. ధోనికి వీలున్నప్పుడల్లా ఈ అకాడమీకి వచ్చి ఔత్సాహిక క్రికెటర్లకు క్రికెట్ పాఠాలు బోధించనున్నాడని నిర్వాహకులు తెలిపారు. అంతేగాక వ్యక్తిగతంగా కూడా ఈ అకాడమీకి సంబంధించిన వ్యవహారాలపై ధోని యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయనున్నట్టు తెలుస్తున్నది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మంగళవారం వెల్లడవనున్నాయి.
కాగా, అంతర్జాతీయ క్రికెట్ నుంచి గతేడాది తప్పుకున్న ధోని.. త్వరలో జరుగబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భారత్ కు మెంటార్ గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. భారత్ కు టీ20 వరల్డ్ కప్ తో పాటు వన్డే ప్రపంచకప్, ఇతర ఐసీసీ టోర్నీలు అందించిన అనుభవం.. టీమిండియాకు కలిసివస్తుందని జట్టు యాజమాన్యం భావిస్తున్నది. స్వదేశంతో పాటు విదేశాల్లో రాణిస్తున్న కోహ్లి సేన.. ఐసీసీ టోర్నీలో అనుభవలేమితో విఫలమవుతున్నది. ఈ నేపథ్యంలో కోహ్లికి.. ధోని జతకలిస్తే ఆ జంటకు తిరుగుండదని బీసీసీఐ పెద్దలు అనుకుంటున్నారు.