టీమిండియా సీనియర్ ప్లేయర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ కు అతి త్వరలో గుడ్ బై  చెప్పే ఆలోచనలో వున్నట్లు అతడి సన్నిహితులు చెబుతున్నారు. ఒకప్పుడు భారత జట్టులో సీనియర్ ఆటగాడిగా వెలుగొందిన అతడు ప్రస్తుతం కనీసం జట్టులో చోటు దక్కించుకోడానికి సతమతమవుతున్నాడు. యువ ఆటగాళ్లు చాలామంది తమ సత్తా చాటుతుండటంతో సెలెక్టర్లు కూడా ఇతడిపై ఆసక్తి చూపడంలేదు. దీంతో ఇక భారత జట్టులో చోటు దక్కించుకోవడం అసాధ్యమని భావిస్తున్న యువరాజ్ మర్యాదగా అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకుంటే బావుంటుందన్న ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. 

అయితే కేవలం అంతర్జాతీయ మ్యాచులకు మాత్రమే రిటైర్మెంట్ ప్రకటించి వివిధ నిర్వహించే లీగుల్లో పాల్గొనాలని యువరాజ్ అనుకుంటున్నాడట. ఐపిఎల్ లో ముంబై  ఇండియన్స్ తరపున కొనసాగుతూనే ఐసిసి అనుమతితో కెనడా, యూరప్‌లలో జరిగే టీ20 లీగుల్లో కూడా ఆడేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఆయా లీగుల నిర్వహకుల నుండి కూడా యవరాజ్ కు భారీ ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా  తనకు వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోడానికి అతడు రిటైర్మెంట్  నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితులు ద్వారా తెలుస్తోంది. 

యువరాజ్ తన రాజీనామా గురించి ఇప్పటికే బిసిసిఐకి  సమాచారం ఇచ్చినట్లు  తెలుస్తోంది. ఒకవేళ బిసిసిఐ అతడి రిటైర్మెంట్ కు ఆమోదం తెలిపితే అతి  త్వరలోనే యువరాజ్ స్వయంగా తన రిటైర్మెంట్ పై ప్రకటన చేయనున్నాడు. ఇలా అంతర్జాతీయ క్రికెట్ దూరమవుతున్నాడు కాబట్టి బిసిసిఐ  అనుమతి లేకున్నా విదేశీ లీగుల్లో పాల్గొనే వెసులుబాటు వుంటుందన్నమాట.