Asianet News TeluguAsianet News Telugu

ఉమేశ్ యాదవ్‌ని మోసం చేసిన మాజీ మేనేజర్... స్థలం కొంటానని చెప్పి...

నాగ్‌పూర్‌లో రూ.44 లక్షల విలువైన స్థలం కొనుగోలు చేసేందుకు మాజీ మేనేజర్‌కి రూ.44 లక్షలు చెల్లించిన ఉమేశ్ యాదవ్... ఆ డబ్బుతో తన పేరిట స్థలం కొని, టోకరా ఇచ్చిన థాక్రే...

Team India Cricketer Umesh Yadav filed cheating case on his ex manager after conned CRA
Author
First Published Jan 22, 2023, 9:36 AM IST

టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్, తన మాజీ మేనేజర్, స్నేహితుడిని నమ్మి లక్షల్లో నష్టం తెచ్చుకున్నాడు. నాగ్‌పూర్‌లో ఓ స్థలం కొనుగోలు చేసేందుకని రూ.44 లక్షలు తీసుకున్న తన మేనేజర్, తనను మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించాడు టీమిండియా క్రికెటర్ ఉమేశ్ యాదవ్...

నాగ్‌పూర్‌లోని కొరడీ ఏరియాలో ఉండే శైలేష్ థాక్రే అనే 37 ఏళ్ల యువకుడు, ఉమేశ్ యాదవ్‌కి చిన్ననాటి స్నేహితుడు. స్నేహితుడి నమ్మకంతో 2014లో అతన్ని తన మేనేజర్‌గా నియమించుకున్నాడు ఉమేశ్ యాదవ్...

నాగ్‌పూర్‌లో స్థలం కొనుగోలు చేయాలని ఉమేశ్ యాదవ్ చూపించిన ఆసక్తిని ఆసరాగా చేసుకున్న శైలేష్ థాక్రే, ఓ మంచి ఏరియాలో స్థలం చూశానని చెప్పి, దాని రిజిస్టేషన్ కోసం డబ్బులు కావాలని నమ్మించి రూ.44 లక్షలు కాజేశాడు...

‘చిన్ననాటి స్నేహితుడు కావడంతో శైలేష్ థాక్రే తక్కువ సమయంలోనే ఉమేశ్ యాదవ్‌కి నమ్మకస్థుడిగా మారిపోయాడు. ఉమేశ్‌కి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ థాక్రేనే చూసుకునేవాడు. అతని బ్యాంకు అకౌంట్‌తో పాటు ఇన్‌కం ట్యాక్స్, ఇతర ఆర్థిక వ్యవహారాలన్నీ థాక్రేకి అప్పగించాడు ఉమేశ్ యాదవ్...

బారెన్ ఏరియాలో ఓ స్థలం అమ్మకానికి వచ్చిందని ఉమేశ్ యాదవ్‌కి చూపించిన థాక్రే, దాని కొనుగోలు కోసం రూ.44 లక్షలు ఇవ్వాల్సిందిగా కోరాడు. ఉమేశ్ ఏమీ ఆలోచించకుండా థాక్రే బ్యాంకు అకౌంట్‌లో ఆ మొత్తాన్ని డిపాజిట్ చేశాడు. 

రూ.44 లక్షలతో థాక్రే, ఆ స్థలం కొనుగోలు చేశాడు కూడా. అయితే ఉమేశ్ యాదవ్ పేరు మీద కాకుండా తన పేరు మీద కొన్నాడు. విషయం తెలుసుకున్న ఉమేశ్ యాదవ్, నిలదీసి అడగగా అది తన సొంత డబ్బుతో తాను కొనుగోలు చేశానని, దీంతో నీకు ఏ సంబంధం లేదని బెదిరించాడు...

స్నేహితుడి చేతితో మోసపోయానని తెలుసుకున్న ఉమేశ్ యాదవ్, కోరడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాడు. 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నాం...’ అంటూ తెలియచేశాడు కేసుని విచారణ చేస్తున్న పోలీస్ అధికారి...

టీమిండియా తరుపున 54 టెస్టులు, 75 వన్డేలు ఆడిన ఉమేశ్ యాదవ్, 10 టీ20 మ్యాచులు ఆడాడు. మొత్తంగా 282 వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్, వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నాడు.. ఐపీఎల్ 2022 సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఆడిన ఉమేశ్ యాదవ్, గత సీజన్‌లోనూ కేకేఆర్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.. 

Follow Us:
Download App:
  • android
  • ios