అన్ని ఫార్మాట్ల నుండి భారత జట్టు సారథ్య బాధ్యతలను ఎంఎస్ ధోని అధికారికంగా వదులుకున్న విషయం తెలిసిందే. అయితే అనధికారికంగా మాత్రం అతడింకా వన్డే, టీ20 లకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడన్నది కూడా అందరికి తెలుసు. మైదానంలో బౌలర్లకు సలహాలు, సూచనలివ్వడం దగ్గర్నుంచి ఫీల్డింగ్ సెట్ చేయడం వరకు అన్నీ తానై చూసుకుంటాడు. అయితే ధోని అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేయకుండా అతడికి సహకరిస్తుంటాడు. దీంతో టీమిండియా మంచి ఫలితాలను రాబడుతోంది. 

అయితే ప్రపంచ కప్ టోర్నీలో కూడా కోహ్లీ, ధోని సమన్వయం వుంటుందా, లేక కెప్టెన్ గా కోహ్లీ హవా కొనసాగుతుందా అన్నఅనుమానం అభిమానుల్లో ఏర్పడింది.ఈ అనుమానాన్ని సీనియర్ ప్లేయర్ సురేశ్ రైనా నివృత్తిచేసే ప్రయత్నం చేశాడు. ''టెక్నికల్ గా మాత్రమే భారత జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్. జట్టు మైదానంలో ఒక్కసారి అడుగుపెడితే చాలు పరిస్థితులన్నీ మారిపోతాయి. ఒక్కసారిగా కెప్టెన్సీ బాధ్యతలన్నీ ధోని చెంతకు వచ్చి చేరతాయి. 

వికెట్ల వెనకాల నుండి బౌలర్లకు సలహలివ్వడం, ఫీల్డింగ్ లో మార్పులు చేయడం వంటివి ధోని చేస్తుంటాడు. అవసరమైనపుడు కోహ్లీకి కూడా సలహాలు ఇస్తుంటాడు. కాబట్టి ధోనిని కెప్టెన్లకే కెప్టెన్ అనవచ్చు. అతడు జట్టులో వుంటే కోహ్లీకే కాదు జట్టు సభ్యులందరికి ఎక్కడలేని బలం వస్తుంది.  

కోహ్లీ కూడా ఆత్మవిశ్వాసంతో కలిగిన మంచి సారథే...కానీ ధోని  అనుభవంతో కూడిన సలహాలకు విలువిస్తుంటాడు. కాబట్టే వీరిద్దరి సమన్వయంతో టీమిండియా అద్భుత విజయాలను అందుకుంటోంది. వీరు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ సమయోచితంగా సారథ్య బాధ్యతలను పంచుకుంటున్నారు. ప్రపంచ కప్ లోనూ ఇదే విధంగా వ్యవహరించే అవకాశం వుంది.'' అంటూ రైనా తనకు ధోనిపై వున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు.