మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో గత ఆరేళ్లుగా క్రికెట్ కు దూరమైన టీమిండియా బౌలర్ శ్రీశాంత్ కు ఊరట లభించింది. అతడిపై విధించిన జీవితకాల నిషేధాన్ని  ఏడేళ్లకు తగ్గిస్తున్నట్లు బిసిసిఐ అంబుడ్స్‌మన్ నిర్ణయించింది. దీంతో మరో ఏడాదిలో అతడు మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. అంటే మళ్ళీ క్రికెట్ ప్రియులు అతడి అగ్రెసివ్ బౌలింగ్ ను చూడనున్నారన్నమాట.

అయితే ఇప్పటికే 36ఏళ్ళ వయసులో వున్న అతడు టీమిండియా జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు లేవు. కానీ క్రికెట్ కు సంబంధించిన వ్యవహారాల్లో పాల్గొనడానికి అవకాశం లభిచింది. అలాగే విదేశాల్లో జరిగే లీగుల్లోనూ, స్వరాష్ట్రం కేరళ తరపున ఆడే అవకాశాలున్నాయి. 

2013లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఫిక్సింగ్ కు పాల్పడినట్లు శ్రీశాంత్ పై ఆరోపణలు  వచ్చాయి. అతడితో పాటు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు అజిత్ చండీలా, అంకిత్ చవాన్  లపై కూడా ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన బిసిసిఐ ఈ ఆరోపణలు నిజమేనని  తేల్చింది. దీంతో ఈ ముగ్గురిపై జీవిత కాల నిషేధాన్ని విధించింది. 

తనను కావాలనే మ్యాచ్ పిక్సింగ్ వివాదంలో ఇరికించి బలిపశువును చేశారంటూ ఆరోపిస్తూ శ్రీశాంత్ కోర్టును ఆశ్రయించాడు. దీంతో కేరళ హైకోర్టు శ్రీశాంత్ కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. కానీ బిసిసిఐ ఈ  తీర్పును సవాల్ చేస్తే సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడ కూడా శ్రీశాంత్ వాదనే నెగ్గింది. అతడిపై  వున్న జీవిత కాల నిషేధాన్ని తగ్గించాలని న్యాయస్ధానం బిసిసిఐ అంబుడ్స్ మెన్ ను ఆదేశిచింది.

సుప్రీం  ఆదేశాలను అనుసరించి శ్రీశాంత్ పై వున్న నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గిస్తూ బిసిసిఐ అంబుడ్స్ మెన్ డికె జైన్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వయసురిత్యా శ్రీశాంత్ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లే  కాబట్టి అతడి నిషేధాన్ని  ఎత్తివేయడం వల్ల ఇండియన్ క్రికెట్ కు ఎలాంటి నష్టముండదు. కాబట్టి 2020  ఆగస్ట్ లో అతడి నిషేధం ఎత్తివేయబడుతుందని జైన్ ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

శ్రీశాంత్ పై నిషేధం ఎత్తివేత

పోలీసుల చిత్రహింసల వల్లే అంగీకరించా: శ్రీశాంత్