తమిళ ప్రజల ఆగ్రహాన్నే కాదు అభిమానాన్ని తట్టుకోవడం కూడా చాలా  కష్టం. వారు ఎవరినైనా అభిమానిస్తే ఎంతలా ప్రేమిస్తారో అక్కడి రాజకీయాలు, సినీపరిశ్రమను చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా తమిళ సినిమా హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో వుండటాన్ని మనం గమనిస్తూనే వుంటాం. అయితే ఈ మధ్యకాలంలో ప్రముఖ హీరోలు విజయ్, అజిత్ ల అభిమానుల మధ్య దూషనల పర్వం కొనసాగుతోంది. అది మరీ మితిమీరి సోషల్ మీడియాకు పాకింది. ఇలా తమిళ సినీ అభిమానుల మధ్య అనవసరంగా  గొడవపై టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విస్ ఘాటుగా స్పందించారు. 

''కొన్ని రోజుల  క్రితమే మన భూగోళం ఓ పెద్ద ప్రమాదం నుండి బయటపడింది. ఓ భారీ ఉల్క భూమికి అతి దగ్గర వచ్చింది. అయితే మన అదృష్టం బావుండి భూమిని   ఢీకొట్టకపోవడంతో  పెను ప్రమాదం తప్పింది. ఇక రుతుపవనాలు గతితప్పి అకాల వర్షాలను కురిపిస్తున్నాయి. ఇలా  కొన్ని పట్టణాలను ప్రస్తుతం  వరదలనుముంచెత్తుతున్నాయి. మరోవైపు ఇదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో తాగడానికి చుక్కనీరు లేక కొన్ని ప్రాంతాలు కరువును అనుభవిస్తున్నాయి.  

ఇక క్రిమినల్ కేసుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో ఒకచచోట ప్రతినిత్యం నేరాలు జరుగుతూనే వున్నాయి. ఇలా ప్రపంచంమొత్తం ఇన్ని సమస్యలతో సతమతమవుతుంటే తమిళనాడు యువత మాత్రం యాక్టర్ విజయ్ చనిపోయాడంటూ తప్పుడు వార్తను ప్రచారం చేయడంలో బిజిగా వుంది.'' అంటూ అశ్విన్ #RIPactorVIJAY పేరుతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప్రచారంపై ఘాటుగా స్పందించాడు.  
 
తమిళ హీరో విజయ్ చనిపోయాడంటూ మరో స్టార్ హీరో అజిత్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. #RIPactorVIJAY హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది. ఈ హ్యాష్ ట్యాగ్ పై ఇప్పటికే 50 వేలకు పైగా ట్వీట్స్ నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో విసిగిపోయిన తమిళ క్రికెటర్ అశ్విన్ ఈ ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టెందుకే తమిళ అభిమానులపై ఆగ్రహాన్ని ప్రదర్శించాడు.